Sports

ఖేల్‌రత్నకు హాకీ సారథి సిఫార్సు

Indian womens hockey captain rani rampal nominated to khelratna

ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారం కోసం భారత్‌ హాకీ మహిళల జట్టు సారథి రాణి రాంపాల్‌ పేరును హాకీ ఇండియా ప్రతిపాదించింది. వందనా కటారియా, మోనికా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ను అర్జున పురస్కారాలకు నామినేట్‌ చేసింది. ఒకప్పటి దిగ్గజ క్రీడాకారులు ఆర్పీ సింగ్‌, తుషార్‌ ఖండేకెర్‌ పేర్లను మేజర్ ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారాలకు ప్రతిపాదించడం గమనార్హం. ఇక కోచ్‌లు బీజే కరియప్ప, రమేశ్‌ పఠానియాను ద్రోణాచార్య పురస్కారాల కోసం ఎంపిక చేసింది. క్రీడాకారిణి, జట్టు సారథిగా రాణి రాంపాల్‌ అద్భుతంగా ఆడింది. మహిళల ఆసియా కప్‌-2017లో విజయాలు, ఆసియా క్రీడలు-2018లో రజతం, 2019లో జరిగిన ఒలింపిక్‌ అర్హత పోటీల్లో రాంపాల్‌ విలువైన పాత్ర పోషించింది. ఆమె సారథ్యంలోనే జట్టు తొమ్మిదో ర్యాంకుకు చేరుకుంది. 2016లో అర్జున, 2020లో పద్మశ్రీ పురస్కారాలను రాణి అందుకుంది. ఇక వందన 200, మోనికా 150+ అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. ఒలింపిక్‌ అర్హత పోటీల్లో కీలకంగా నిలిచారు.