తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయో లేదోగానీ, తాటాకులతో అల్లిన ఈ బుట్టల్నీ బాక్సుల్నీ చూస్తే మన కళ్లు చెదరడం మాత్రం ఖాయం. అందుకే ఈమధ్య పెళ్లీ పేరంటాల్లో సామగ్రిని పెట్టేందుకూ కానుకల్ని పెట్టి ఇచ్చేందుకూ సరికొత్త డిజైన్ల తాటాకు బుట్టలే అందంగా కనువిందు చేస్తున్నాయి. అటు వేడుకలకి అందాన్నిస్తూ ఇటు పర్యావరణానికీ మేలు చేస్తున్నాయి..!
***గలగలలాడే తాటాకులతో ఒకప్పుడు చింకి చాపలూ విసనకర్రలూ సాదా బుట్టలూ అల్లడం తెలిసిందే. కానీ అసలవి తాటాకులతో చేసినవేనా అనిపించేంత అందంగా అలంకరణ వస్తువులతోబాటు బ్యాగులూ పర్సులూ వంటి యాక్సెసరీల్నీ కళాకారులు అల్లేస్తుంటే, అంతే ఇష్టంగా వాటిని వాడుతోంది ఈతరం.
***కరవుకాటకాల్నీ తుపాన్లనీ తట్టుకుని వంద సంవత్సరాలకు పైగా జీవించే తాటిచెట్టు పేదవాడి కల్పతరువు. దాని ఆకులూ కాయలూ పండ్లూ గింజలూ వేర్లూ కాండం సకలం వాడుకో దగ్గవే. ముఖ్యంగా తాటాకుల గురించయితే ప్రత్యేకంగా చెప్పుకుని తీరాల్సిందే. దక్షిణ భారతంలో వేసవి వచ్చిందంటే చాలు… ఇంటిముంగిట తాటాకులతో చలువ పందిళ్లు వేస్తారు. పాకలూ గొడ్లచావిళ్ల మీద పాత ఆకుల స్థానంలో కొత్తవి కప్పుతారు. వర్షాకాలం కోసం గొడుగులూ టోపీలూ చేస్తుంటారు. పండ్లను మగ్గబెట్టేందుకూ తాటాకు బుట్టల్నే వాడతారు. ఇక, ప్రాచీనకాలంనాటి గ్రంథాలన్నీ తాళపత్రాలే… అంటే తాటాకులమీద రాసినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ ఆకులోని వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది. అందుకే తాటాకుతో అందమైన వస్తువుల్ని తయారుచేసే సంప్రదాయం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తమిళనాట ఇది మరీ ఎక్కువ. దేశవ్యాప్తంగా ఏడెనిమిది కోట్ల తాటిచెట్లు ఉంటే, వాటిల్లో సగం తమిళనాటే ఉన్నాయి.
***తాటాకు… పెళ్లి కానుక!
కారైకుడి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఈ తాటిచెట్ల సంఖ్య మరీ ఎక్కువట. అందుకే అక్కడి హస్తకళావస్తువుల తయారీలో తాటాకే అత్యంత కీలకం. గ్రామాల్లో ఆకులతో బుట్టల్నీ పాత్రల్నీ రకరకాలుగా అల్లి అమ్మేవారు. ఇలా తాటాకులతో అల్లడాన్నే వాళ్లు కొట్టాన్ కళగా పిలుస్తారు. అయితే క్రమంగా ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వీటి వాడకం, తయారీ దాదాపుగా నిలిచిపోయింది. కానీ ఎం.ఆర్.ఎం.ఆర్.ఎం. కల్చరల్ ఫౌండేషన్ ద్వారా తాటాకు కళను పునరుద్ధరించేందుకు నడుం బిగించారు విశాలాక్షి రామస్వామి. అందులోభాగంగా అనేక గ్రామాలకు చెందిన మహిళలకి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మరీ అల్లించడంతో తాటాకు పచ్చగా కళకళలాడుతోంది. పెళ్లిళ్లలో కానుకల్ని ఇచ్చే బాక్సులూ సారెలో తెచ్చే చీరలూ మిఠాయిలూ అలంకరించే బాక్సులూ ట్రేలూ బుట్టలూ… ఇలా అన్నిరకాల వస్తువుల్నీ తాటాకులతోనే అల్లేస్తున్నారు ఆ ప్రాంత మహిళలు. గిలగిచ్చకాయలూ పండ్ల బుట్టలూ చాపలూ వేజ్‌లూ బ్యాగులూ పూలదండలూ.. ఇలా తాటాకు అల్లికలెన్నో. వీటి అల్లికకోసం ఆకుల్ని చీల్చేందుకు ప్రత్యేకమైన పనిముట్లని ఉపయోగిస్తారు. లేత ఆకుల్ని భిన్న పరిమాణాల్లో చీల్చి రంగునీళ్లలో ఉడికించి మరీ ఆరబెట్టి అల్లుతారు. అల్లేముందు వాటిమీద నీళ్లు చల్లడంవల్ల ఆకులు విరిగిపోకుండా ఉంటాయి. బుట్ట సైజుని బట్టి అల్లికని ఎంచుకుని, ఈనెల్ని మూతిభాగంలో గట్టిదనంకోసం వాడుతుంటారు. ఆ స్ఫూర్తితో మరెందరో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో తాటాకులతో మరింత అందంగా అల్లేస్తుంటే, వాటిని కొనడం ద్వారా ఆ కళకి జీవం పోస్తున్నారు పర్యావరణ ప్రేమికులు..!
తాటాకు బహుమతులు
Related tags :