Movies

ప్రశాంతత కోసం పారిపోయా

Priya warrier on her disappearance from insta

‘‘లాక్‌డౌన్‌ వల్ల ప్రజలంతా 24 గంటలూ ఆన్‌లైన్‌లో ఉంటున్న ఈ సమయంలో ఆమె ఎందుకిలా చేసింది? ఆన్‌లైన్‌కి దూరంగా ఎందుకు వెళ్లిందని చాలామంది అనుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌కి కొన్ని రోజులు దూరంగా ఉండాలని అనుకున్నానంతే! అంతకు మించి ప్రత్యేకించి కారణాలేవీ లేవు. నా ప్రశాంతత, మానసిక ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. ముఖ్యం కాదు’’ అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అన్నారు. తెలుగులో ‘లవర్స్‌ డే’గా విడుదలైన మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్‌ లవ్‌’లోని ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో కన్ను గీటే సన్నివేశంతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలు దోచారీమె. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారీమె. అటువంటిది ఉన్నట్టుండి రెండు వారాల క్రితం ఇన్‌స్టా ఖాతాను డీ-యాక్టివేట్‌ చేయడం చర్చనీయాంశమైంది.తాజాగా అకౌంట్‌ను యాక్టివ్‌ చేసిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఆమె మాట్లాడుతూ ‘‘నిజాయతీగా చెప్పాలంటే… ఈ రెండు వారాలు చాలా ప్రశాంతంగా గడిచాయి. నేను మరీ ఎక్కువ రోజులు ఇన్‌స్టాకి దూరంగా లేను. నా వృత్తి వల్ల ఎక్కువ కాలం దూరంగా ఉండలేను. కుదరదు కూడా! రెండు వారాలే అయినా ఎంతో సరదాగా గడిపా. ఇన్‌స్టా, ఇతర సోషల్‌ మీడియా ఖాతాలు ఎప్పుడూ నా ప్రశాంతత, ఆలోచనలకు భంగం కలిగించకూడదని అనుకున్నా. అయితే, లాక్‌డౌన్‌ కాలంలో లైకులు, ఫాలోయర్లు, అన్‌ ఫాలోయర్లు నా తలకు ఎక్కి ఒత్తిడికి లోనయినట్లు అనిపించింది. వీటన్నిటికీ దూరంగా పారిపోవడమే మంచిదని విరామం తీసుకున్నా. అయితే, పబ్లిసిటీ కోసమే ఇన్‌స్టాలో అకౌంట్‌ డీ-యాక్టివేట్‌ చేసిందని ఒకరు అన్నారు. అది చాలా బాధ కలిగించింది. ప్రాణాల కోసం ప్రజలు పోరాడుతున్న ఈ సమయంలో ఎవరు పబ్లిసిటీ కోరుకుంటారు? రాసేటప్పుడు కొంచెం కూడా ఆలోచించరేమో?? ట్రోలింగ్‌ భరించలేక వెళ్లిపోయిందని ఇంకొందరు అన్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచి ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నా. నాకేమీ కొత్త కాదు. త్వరగా సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నా’’ అన్నారు.