తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రశాఖ అధ్యక్షుడి వేటలో ఉంది.
పార్టీ రాష్ట్రశాఖ పగ్గాలను ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఆరా తీస్తోంది. పార్టీ కీలక నాయకుల అభిప్రాయాలను సేకరిస్తోంది.
వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడికే అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అగ్ర నాయకత్వం..సమర్థుడైన నాయకుడి కోసం జల్లెడ పడుతోంది. పలు పేర్లు ముందుకు రావడంతో వాటిని మళ్లీ వడపోయబోతోంది.
అదే సమయంలో కొంతకాలంగా ఖాళీగా ఉంటోన్న పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేయబోతోంది.
పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేసిన తరువాత.. ఒకేసారి వారి పేర్లను ప్రకటిస్తారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఇదివరకు దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.
ఆయన టీడీపీకి రాజీనామా చేసి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంటోంది.
ప్రస్తుతం సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కళా వెంకట్రావు టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఆయన స్థానంలో మరొక బీసీ నాయకుడినే ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.
మొన్నటి డిజిటల్ మహానాడులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సారి యువనేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ దిశగా పలువురు నాయకుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది.
పార్టీకి బీసీలు దూరం అయ్యారని సాక్షాత్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా వెల్లడించారు.
డిజిటల్ మహానాడు వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. బీసీ ఓటుబ్యాంకును మళ్లీ ఆకట్టుకోవడానికి చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.
దూకుడు వైఖరిని ప్రదర్శించగల నాయకుడు పార్టీ రాష్ట్రశాఖకు సారథ్యాన్ని వహించాల్సి ఉంటుందని చంద్రబాబు అప్పట్లోనే ఓ స్పష్టమైన సంకేతాన్ని పంపించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్‌కు పేరు బలంగా వినిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకట్రావు బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడే అయినప్పటికీ, దూకుడుగా వ్యవహరించలేకపోయారని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
బీసీలను ఆయన ప్రభావితం చేయలేకపోయారనే భావన చంద్రబాబులో వ్యక్తమౌతోందని అంటున్నారు.
ఈ సారి యువకుడికే పగ్గాలు అప్పగించడం ద్వారా యువతను ప్రోత్సహించినట్టవుతుందని, ఈ దిశగా బీద రవిచంద్రకు అవకాశాన్ని ఇవ్వాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.