* గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 141 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇందులో రాష్ట్రానికి సంబంధించి 98, ఇతర ప్రాంతాలకు సంబంధించి 43 పాజిటివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,112కి చేరింది.కరోనాతో ఇప్పటి వరకు 71 మంది మృతి చెందారు.
* ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లోనూ కరోనా ఉనికి వెల్లడైంది. ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. ఆ ఉద్యోగి కియా మోటార్స్ లోని బాడీ షాప్ లో విధులు నిర్వర్తిస్తుంటాడని, తమిళనాడుకు చెందినవాడని తెలుసుకున్నారు. ఈ నెల 25న కర్మాగారానికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడ్ని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కియో మోటార్స్ కూడా ఇటీవలే తెరుచుకుంది. అనేక జాగ్రత్తలు తీసుకునే… ఉద్యోగులను లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి కరోనా బారినపడడం అటు సంస్థ యాజమాన్యాన్ని కలవరపెడుతుండగా, ఇటు ఉద్యోగుల్లోనూ ఆందోళన కలుగుతోంది.
* తమిళనాడు ఇవాళ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1384 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 12 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,256కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 220 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
* కరోనా విపత్కర పరిస్థితుల్లో వివిధ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు రక్షణ కిట్లు (పీపీఈ కిట్లు) ఇచ్చినప్పటికీ వారికి కరోనా ఎలా సోకిందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పరీక్షల నిర్వహణపై విశ్రాంత డీఎంహెచ్‌వో రాజేందర్, విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, మరికొంత మంది దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారించింది.
* కేరళలో ఈ రోజు కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మరోవైపు కొవిడ్‌తో ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 884 యాక్టివ్ కేసులు ఉన్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
* దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న 54 రోజుల కాలంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపు అనేది ఉద్యోగులు, యాజమాన్యానికి సంబంధించిన విషయమని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. అంతేకాకుండా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని కూడా తెలిపింది. లాక్‌డౌన్ అమలులో ఉన్న కాలంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలను చెల్లించాలని హోంశాఖ మార్చి 29న ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
* నేపాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. దేశంలో గత 24 గంటల్లో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,634కి పెరిగింది. ఇందులో 10 మంది చనిపోగా, 290 మంది రికవరీ అయ్యారు.
* కరోనా.. లాక్‌డౌన్ దృష్ట్యా మూతపడ్డ హోటళ్లు.. పర్యాటక రంగానికి జూన్ 8 నుంచి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పర్యటక రంగానికి లాక్‌డౌన్ పూర్వ స్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘రాష్ట్రానికి తీర, అటవీ ప్రాంతాలు, హిల్ స్టేషన్లు, రివర్, టెంపుల్ టూరిజం వంటి ప్రత్యేకతలున్నాయి. కేంద్ర నిబంధనల మేరకు హోటళ్లు, పర్యటక కార్యకలాపాలు ప్రారంభిస్తాం. పర్యాటక శాఖకు చెందిన హోటళ్లలో ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు’’అని మంత్రి అవంతి తెలిపారు.