* గత రెండు నెలల్లో ఆటోమొబైల్ రంగం ఎన్నడూ చూడని నష్టాలను చవిచూసింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో మార్కెట్లోకి కొత్త ఉత్పత్తుల విడుదల కూడా వాయిదావేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అలానే రెండు సంవత్సరాలకొకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆటోఎక్స్‌పో కూడా రద్దయిన విషయం తెలిసిందే. రెండో విడత లాక్‌డౌన్ సమయంలో పరిశ్రమలు పరిమిత సంఖ్య ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఉద్యోగులను కరోనా భయం వెంటాడటంతో ఆశించినంతగా కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల కాలేదు. జూన్ 8 నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో షోరూంలు తెరుచుకునేందుకు అనుమతించడంతో.. తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు తయారీదారులు సిద్ధమయ్యారు.
* దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న 54 రోజుల కాలంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపు అనేది ఉద్యోగులు, యాజమాన్యానికి సంబంధించిన విషయమని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. అంతేకాకుండా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని కూడా తెలిపింది. లాక్‌డౌన్ అమలులో ఉన్న కాలంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలను చెల్లించాలని హోంశాఖ మార్చి 29న ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టులో జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. కాగా, ఈ విషయమై నేడు విచారణ కొనసాగింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఊగిసలాట ధోరణిలో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 128 పాయిట్లు నష్టపోయి 33,980 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 వద్ద కొనసాగుతున్నాయి. తొలుత సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో మొదలైనా.. ఆ తర్వాత మెల్లగా నష్టాల్లోకి జారుకొంది. ఇవాళ కూడా లాభాల జోరును కొనసాగిస్తుందని భావించారు. కానీ, కొర్పొరేట్ ఫలితాలు, కరోనావైరస్ వ్యాప్తి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈరోజు మొత్తం 15 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిలో డీఎల్‌ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్, ఎస్‌ఆర్‌ఎఫ్ వంటి కంపెనీలు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 4 కోట్ల షేర్లను విక్రయించనుండటం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లు కొంత సానుకూలంగా ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు పెరిగి నేడు పీపా చమురు 40 డాలర్లకు చేరింది.
* కరోనా వైరస్ మహమ్మారి విస్తరించి వ్యాపార కార్యకలాపాలు మందగించిన నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సిబ్బందికి ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసినట్లు అమరరాజా బ్యాటరీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అదే సమయంలో ఉన్నతస్థాయి సిబ్బందికి 10 శాతం నుంచి 25 శాతం వరకూ జీతాల్లో తాత్కాలికంగా కోత విధిస్తున్నట్లు పేర్కొంది. మరోపక్క సంస్థ ప్రమోటర్లు తమ జీతభత్యాల్లో 50 శాతం తగ్గింపునకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు వెల్లడించింది. కార్మికులకు, శిక్షణ ఉద్యోగులకు మాత్రం ఎటువంటి కోత లేకుండా పూర్తిగా జీతభత్యాలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి బీపీఎల్‌పీ (బిజినెస్ పెర్‌ఫార్మెన్స్ లింక్డ్ పే) పథకాన్ని కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రకారం ప్రస్తుతం జీతభత్యాల్లో కోతపడిన ఉన్నతస్థాయి ఉద్యోగులకు, వచ్చే ఏడాది వ్యాపార కార్యకలాపాలు కోలుకున్న పక్షంలో తిరిగి ఈ మొత్తాన్ని వారికి చెల్లిస్తారు. తమ ఉత్పత్తులకు కొన్ని విభాగాల నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించినంత గిరాకీ ఉండకపోవచ్చని, అందువల్ల ఆదాయాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యయాల తగ్గింపు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని కంపెనీ మానవ వనరుల విభాగం అధ్యక్షుడు బి.జయకృష్ణ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను తట్టుకోవటానికి వీలుగా అన్ని రకాలైన వ్యాపారావకాశాలను కంపెనీ పరిశీలిస్తోందని వివరించారు.
* అధిక శాతం మంది వృత్తి నిపుణులు, వేతన జీవులు తమ భవిష్యత్ ఆర్థిక అవసరాలపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియా లెండ్స్ సర్వే వెల్లడించింది. కొవిడ్-19 ప్రభావంతో ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి రావొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 5,000 మంది పాల్గొన్న ఈ సర్వేలో వివరాలు ఇలా ఉన్నాయి.
* 94 శాతం మంది వ్యక్తులు వచ్చే కొన్ని నెలల పాటు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని వెల్లడించారు.
* కొవిడ్-19 ప్రభావంతో తమ ఆర్థిక ఆరోగ్యం బాగా దెబ్బ తిని, అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 82 శాతం మంది పేర్కొన్నారు.
* 84 శాతం మంది తాము ఖర్చుల్ని బాగా తగ్గించుకున్నామని తెలపగా, 90 శాతం మంది తమ పొదుపు, ఆర్థిక భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నామన్నారు.