Editorials

మాల్యా అప్పగింతలో లొసుగులు

మాల్యా అప్పగింతలో లొసుగులు

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేసి భారత్‌లో కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందనుకుంటున్న క్రమంలో, తదుపరి చట్టపరమైన సమస్యలు పరిష్కారమయ్యేదాకా మాల్యాను భారత్‌కు అప్పగించడం వీలుకాదని బ్రిటిష్‌ హైకమిషన్‌ గురువారం పేర్కొంది. ఆ చట్ట పరమైన అంశాలు ఏమిటన్నవి మాత్రం గోప్యంగా ఉంచారు.

‘‘విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ లండన్ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బ్రిటిష్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని మాల్యా ఆశ్రయించాడు. గత నెలలో దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించాల్సి ఉంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించాలంటే మాత్రం అతనిపై ఉన్న ఇతర చట్ట పరమైన అంశాలన్నీ పరిష్కారం కావాల్సి ఉంది. అప్పటిదాకా మాల్యా బ్రిటన్‌ విడిచి వెళ్లడానికి కుదరదు’’ అంటూ బ్రిటిష్‌ హై కమిషన్‌ అధికారి ప్రతినిధి వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ..యూకే చట్టం ప్రకారం ఆ అంశాలన్నీ పరిష్కారం అయ్యాకే భారత్‌కు అప్పగింత ప్రక్రియ ఉంటుందన్నారు. వాటి పరిష్కారం ఎప్పటికి పూర్తవుతుందనేది మాత్రం ఇప్పుడే వెల్లడించలేమన్నారు. సాధ్యమైనంతవరకు వేగంగా పూర్తి చేసేందుకే ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.