WorldWonders

నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లో నలుగురి హత్య

నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లో నలుగురి హత్య

నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా కర్ఫ్యూ కొనసాగుతున్నా ప్రత్యర్థులను వెంటాడి మరీ మట్టుబెట్టారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని గోల్కొండ పోలీస్‌ ఠాణా పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. గోల్కొండలో నివసిస్తున్న రౌడీషీటర్‌ చాందీ షేక్‌ మహ్మద్‌, అతని స్నేహితుడు చికెన్‌ సెంటర్‌ యజమాని ఫయాజుద్దీన్‌లు రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఎండీ లైన్స్‌ నుంచి గోల్కొండకు వెళ్తున్నారు. 10.30 గంటల ప్రాంతంలో వారిని వెంబడిస్తూ వచ్చిన క్వాలిస్‌ వాహనం వెనుక నుంచి మొరైన్‌ బేకరీ సమీపంలో ఢీకొట్టింది. రోడ్డుపై ఇద్దరూ కిందపడ్డారు. క్వాలిస్‌ నుంచి దిగిన ముగ్గురు రౌడీషీటర్లు వారిని పట్టుకొని కత్తులతో పొడిచారు. షేక్‌ మహ్మద్‌ కేకలు వేస్తున్నా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో స్పందన కరవైంది. అతడే లక్ష్యంగా ప్రాణం పోయేంత వరకు రౌడీషీటర్లు దాడి చేస్తూనే ఉన్నారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వస్తోందన్న అనుమానంతో క్వాలిస్‌ను వదిలేసి పారిపోయారు. తరవాత అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న ఫయాజుద్దీన్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, సంయుక్త కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను గుర్తించామని త్వరలో పట్టుకుంటామని కమిషనర్‌ తెలిపారు. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పాతబస్తీ రెయిన్‌ బజార్‌ ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌, రెయిన్‌బజార్‌ సీఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. యాకుత్‌పురా చున్నేకిబట్టి చందానగర్‌కు చెందిన విద్యార్థి మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌(25)కు ఆస్తి వివాదాలున్నాయి. శుక్రవారం జాఫర్‌రోడ్డు వెళ్లే మార్గంలో నడుస్తూ వెళ్తున్న అతన్ని ఆగంతుకులు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆస్తి వివాదాలే హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. ఇమ్రాన్‌ తల్లి హబీబున్నిసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోల్కొండ ఠాణా పరిధి మల్లేపల్లికి చెందిన రాహుల్‌ అగర్వాల్‌(28) స్థానికంగా ప్రకాశ్‌ మెడికల్‌షాపును నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అజర్‌(28) రాహుల్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అల్లాపూర్‌లోని శ్మశానవాటిక సమీపంలో రాహుల్‌ మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ శివమారుతీ, గోల్కొండ సీఐ చంద్రశేఖర్‌రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పడిఉన్న కొత్త యాక్టివాలోని పుస్తకాల ఆధారంగా చనిపోయింది రాహులని గుర్తించారు. అజర్‌ ఈ హత్య చేశాడని తమ విచారణలో తేలిందని, కారణాలు నిందితుడు దొరికితేనే తెలుస్తుందని డీసీపీ తెలిపారు.