DailyDose

కొత్త పథకాలు ఉండవు-వాణిజ్యం

Nirmala sitharaman makes announcement on new schemes in india this year

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్’‌, ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అభియాన్‌’ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులైనా.. ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్‌ ఆమోదం పొందిన ఇతర పథకాలను మార్చి 31,2021 వరకు నిలిపివేస్తున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు పంపొద్దని ఇతర మంత్రిత్వ శాఖలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

* మార్కెట్ల ఆరు రోజుల వరుస లాభాలకు గురువారం విరామం పడిన సంగతి తెలిసిందే. అయితే, శుక్రవారం సూచీలు తిరిగి పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌, ఆటో, లోహ, ఇన్‌ఫ్రా రంగా షేర్ల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 306 పాయింట్లు లాభపడి, 34,287 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 10,142 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 75.58 వద్ద కొనసాగుతోంది.

* కరోనా సంక్షోభంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌)కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ వంటి బడా కంపెనీలను ఆకర్షించిన జియో తాజాగా అబుదాబికి చెందిన ముబాదల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.9,093.6 కోట్ల పెట్టుబడుల ద్వారా 1.85 శాతం వాటాను కైవసం చేసుకునేందుకు ముబాదల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆర్‌ఐఎల్‌ స్వయంగా ప్రకటించింది.

* ప్రదీప్‌ బర్మన్‌ నేతృత్వంలోని ఔషధ కంపెనీ సనత్‌ ప్రోడక్ట్స్‌ను హోమియోపతి సంస్థ డాక్టర్‌ విల్మార్‌ స్కావాబే కొనుగోలు చేసింది. అయితే లావాదేవీ వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ.. సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం కొనుగోలు విలువ రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత కొనుగోలుతో ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) విభాగంలో అడుగుపెట్టడమే కాకుండా, తమ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించుకునే వీలుంటుందని డాక్టర్‌ విల్మార్‌ స్కావాబే ఒక ప్రకటనలో తెలిపింది. సనత్‌ ఉత్పత్తులను ప్రపంచ శ్రేణి ఉత్పత్తులుగా మార్చేందుకు కొత్త సాంకేతికత, ఉపకరణాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టే యోచనలో కూడా ఉన్నట్లు తెలిపింది.