అత్యుత్తమ సారథులు తమ తప్పుల నుంచే నేర్చుకుంటారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. నాయకత్వ లక్షణాలపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ద్రవిడ్‌ను యువీలా ఆడించలేమని, అలాగే యువీని కూడా ద్రవిడ్‌లా ఆడమని చెప్పలేమన్నాడు. దేన్నైనా అందిపుచ్చుకోవడం నాయకత్వ లక్షణాల్లో కీలకమని వ్యాఖ్యానించాడు. పరిస్థితులకు తగ్గట్టు నెట్టుకుపోవడం సారథ్య లక్షణాల్లో ముఖ్యమైన విషయమని చెప్పాడు. అలాగే జట్టు సభ్యుల్లోని సహజ నైపుణ్యాలను గుర్తించాలని, యువరాజ్ సింగ్‌ను ద్రావిడ్‌లా మార్చలేమని.. యువీని కూడా ద్రవిడ్‌లా ఆడించలేమని దాదా వివరించాడు. ఒకవేళ అలాంటి ప్రయోగం చేస్తే, అది దారుణంగా విఫలమౌతుందని అభిప్రాయపడ్డాడు. అత్యుత్తమ సారథులు తప్పులు చేస్తారని.. అయితే, వాళ్ల ఆలోచనా దృక్పథం సరిగ్గా ఉన్నంతకాలం అవన్నీ సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నాడు. సరైన సారథిగా మారడానికి తప్పుల నుంచే నేర్చుకోవాలని, మిగతా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఓటములు ఎదురైతే కుంగిపోవాల్సిన అవసరం లేదని, అవి ఎదుగుదలలో భాగమని స్పష్టంచేశాడు. వైఫల్యాల నుంచి నేర్చుకుంటే అవి గెలుపు బాటకు దారితీస్తాయన్నాడు. గంగూలీ 2012లో రిటైరయ్యాక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే గత అక్టోబర్‌లో అనూహ్యంగా బీసీసీఐ పగ్గాలు అందుకొన్నాడు.
యువరాజ్ ద్రవిడ్‌లా ఆడలేడు
Related tags :