మానవునికి మొదటలో చదవడం, రాయడం తెలియదు కాబట్టి రాత పరికరాల అవసరమే లేకపోయింది. అయితే తన భావాలను సంజ్ఞలు, బొమ్మల రూపంలో వ్యక్తంచేయడానికి మొదట్లో గుహల గోడలను, బండలను ఉపయోగించుకున్నాడు. ప్రపంచంలో ప్రాచీన లిపులను చూసినప్పుడు అక్షరాలు బొమ్మలుగా కనిపించడానికి కారణం ఈ లిపులన్నీ ప్రాచీన మానవుడు మొదటలో తన భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించిన బొమ్మల నుంచి పరిణామం చెందినవి కావడమే అనే అభిప్రాయం పురావస్తు శాస్త్రవేత్తల్లో ఉంది. ఇటువంటి లిపులనే వీరు ‘చిత్రలిపి’ అని పిలుస్తున్నారు. లిపి అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ తలెత్తిందే కాని ఒకే చోటు నుంచి ప్రపంచమంతా విస్తరించిందిని భావించరాదు. ఎందుకంటే ఒకే చోటు నుంచి వివిధ ప్రాంతాలకు వ్యాపించి ఉన్నట్లయితే కొద్ది తేడాలున్నా లిపులన్నీ సారూప్యం కలిగి ఉండాలి కదా. ఇన్ని వందలు, వేల లిపులు ఎందుకున్నట్లు? *లిపి ఒక్కటే ఉంటే సరిపోదు. భావాలను వ్యక్తంచేయడానికి ఏదో ఒక భాష ఉండాలి కదా. కొన్ని భాషలను కొన్ని లిపులలోనే రాయగలం. అంటే భాషలను బట్టే లిపి రూపొందింద న్నమాట. భాష పరిణామం చెంది మాట్లాడుకోవడానికే కాక ఇతరులకు, భావితరాలకు కొన్ని విషయాలను చెప్పడానికి లిపి అవసరం ఏర్పడింది.మన దేశంలో మొదట్లో రాతకోతలకు రాతి బండలు, రాగి రేకులను వాడేవారు. ఆ తరువాతి కాలంలో తాటాకుల వాడకం వచ్చింది. తాటాకులనే తాళపత్రాలని అంటారు. తాళపత్రాలపై రాత ఆరంభమైన తరువాతే పెద్ద పెద్ద గ్రంథాల రచన ఆరంభమైనదని చెప్పవచ్చు. మన తెలుగుప్రాంతానికి సంబంధించినంతవరకు ‘కవిత్రయం’ రాసిన మహా భారతమే మొదటి తాళ పత్ర గ్రంథంమని భావిస్తున్నారు. అంతకు ముందు ఉన్నా వెలుగులోకి రాలేదు కాబట్టి ఇట్లా భావిస్తున్నారు. భారత రచన తరువాతే కవులు, రచయితలు అనేక గ్రంథాలు రాసినట్లు చెబుతున్నారు. అయితే మొదట్లో రాసిన గ్రంథాలన్నీ దేవునికి సంబంధించిన పవిత్ర రచనలుగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి గ్రంథాలను రాయడానికి తాళపత్రాలు పెద్ద మొత్తంలో అవసరం కాబట్టి తాడిచెట్లను విరివిగా పెంచేవారు. ఇట్లా పెంచడం పవిత్ర కార్యంగా పూర్వులు భావించినట్లు అనేక శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ చెట్ల పెంపకం పవిత్ర కార్యమే గాక వాటి నుంచి లభించు వస్తువులను కూడా పవిత్రమైనవాటిగా భావించేవారు. జాబు (ఉత్తరం)కి ‘కమ్మ’ అనే పేరు తాటాకును బట్టే వచ్చింది. తాటాకు చుట్టగా చుట్టి, పసుపు పూసి, నూలి బొందుతో కట్టి పెండ్లి కూతురు మెడలో మూడుముడులు వేయించేవారు. అందుకే దాన్ని ‘తాళిబొట్టు’ అని పిలిచారు. తాళి అంటే తాడి (తాడిచెట్టు) అనే అసలర్థం. తెలుగు స్త్రీలు చెవులకు పెట్టుకొనే కమ్మలుగా తాటియాకులనే చుట్టి పెట్టుకొనేవారు. దీన్నే ‘చెవాకు’ అని పిలిచేవారు.పంచాంగాలు, పురాణాలు, శాస్త్రాలు, లౌకిక గ్రంధాలు, వ్యాకరణాలు అన్నీ తాటాకుల మీదే రాసేవారు. రాయడానికి అవసరమైన వెడల్పయిన ఆకులను ఇచ్చే చెట్లను బ్రాహ్మణులు ప్రత్యేకంగా పెంచేవారు. తాటియాకులను చక్కగా ఈనెలు తీసి, చుట్టలు చుట్టి, పేడ నీళ్లలో తేలికగా ఉడకనిచ్చి నీడలో చల్లారబెట్టి నిలవచేసుకొనేవారు. ఆకులకు పురుగు పట్టకుండా పసుపు, వస ఉడికించి ఆ నీళ్లలో ఈ ఆకులను వేసేవారని చెబుతారు. రాత చక్కగా కనిపించడానికి బీరాకు పసరు, బొగ్గు రాసేవారు. మెరుపుకోసం నూనె పూసేవారు. రాసే తాటియాకుల పొడవు వెడల్పు దొరికిన ఆకులను బట్టి ఉంటుంది. ఒక్కో ఆకుపై ఆరు నుండి ఎనిమిది వరుసలు రాయవచ్చు. ప్రతి ఆకులోను నాలుగైదు పద్యములు రాయవచ్చు.. రైండువైపులా రాసేవారు. ఎడమవైపు విడిచిన భాగాలలో తమ ఇష్టదైవాలకు వందనాలు రాసేవారు. ఒక్కోసారి బొమ్మలు కూడా వేసేవారు.తాటియాకు అంచుకు కొంచెం దూరంగా కుడివైపు, ఎడమవైపు చిల్లులు చేసి, ఆ రంధ్రముల గుండా సన్నని తాడు దూరుస్తారు. ఆకులు వంగిపోకుండా, చెదరిపోకుండా మొదటి, చివరి ఆకుల మీద తాటి మట్టలతోనో, టేకు కట్టెలతోనో ఆకులతో సమానంగా పొడవు, వెడల్పుగల చెక్కలను తయారుచేసి, వాటికి ఆకుల రంధ్రములతో సమానంగా రంధ్రాలు చేసి తాడును దూర్చి ఆకులను బంధించేవారు. ఇట్లా బంధించడం వల్లనే ఆ పుస్తకములకు గ్రంథములు, ప్రబంధములు అనే పేరు వచ్చింని ఆదిరాజు వీరభద్రరావు రాశారు. ఆకులపై రాసే ఇనుప గంటములు సున్నితమైన మొనగలిగి రకరకాలుగా ఉండేవి. సాదా గంటములు, గజ్జెల గంటములు, బొమ్మల గంటములు, కత్తి గంటములు అనే రకాలు ఉండేవంట. రాసిన తాళపత్ర గ్రంథములను జాగ్రత్తగా కాపాడితే రెండు మూడు వందల ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండిపోతాయి.
తాళపత్రాలు అలా తయారు చేసేవారు
Related tags :