DailyDose

5ట్రిలియన్లు సాధించి తీరుతాం-వాణిజ్యం

5ట్రిలియన్లు సాధించి తీరుతాం-వాణిజ్యం

* అద్భుతమైన ఆఫర్లలో వినియోగదార్లను ఆకట్టుకునే జియో తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, రూ.401 నెలవారీ రిఛార్జీ ప్లాన్‌, రూ.2,599 వార్షిక ప్లాన్‌, రూ.612, రూ.1208 డేటా వౌచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కంపెనీ.. వినియోగదారుల నుంచి భారీ స్పందన రావడంతో శనివారం రాత్రి వివరాలతో పాటు ప్లాన్‌ను లాంఛ్‌ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉంచింది.

* మనదేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యసాధనపై వెనకడుగు లేదని మాజీ కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించటం ఖాయమని, కాకపోతే అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణా వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) నిర్వహించిన ‘వెబినార్‌’ లో ఆయన మాట్లాడారు. సత్వర వృద్ధి సాధన దిశగా జిల్లా స్థాయి ప్రణాళికలు- అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, జిల్లాల్లో సాధారణ వృద్ధి కంటే 3 శాతం అధిక వృద్ధి సాధించగలిగితే మనదేశం మళ్లీ ఆకర్షణీయమైన వృద్ధి రేటుకు చేరువవుతుందని పేర్కొన్నారు.

* జీఎస్‌టీ రేటు తగ్గింపుతోపాటు తుక్కు పాలసీని కూడా ప్రభుత్వం ప్రకటిస్తేనే ఆటోమొబైల్‌ రంగం వేగంగా కోలుకొంటుందని వాణిజ్య అశోక్‌ లైల్యాండ్‌ కంపెనీ ఎండీ, సీఈవో విపిన్‌ సొంధి సూచించారు. ఆటోమొబైల్‌ రంగంలో మందగమనం, కరోనావైరస్‌ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు. ఈ రెండు అంశాలు అమలు చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందని వెల్లడించారు.

* ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ షావోమి ‘ఎలక్ట్రిక్‌ టూత్‌బ్రష్‌’ను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ ట్విటర్‌లో పెట్టిన ఓ వీడియో ఆసక్తి రేపుతోంది. ‘మీలో ఎంత మంది ఇప్పటికీ మాన్యువల్‌ బ్రషింగ్గే చేస్తున్నారు. ప్రోక్లీనింగ్‌ కోసం అద్భుతమైనది త్వరలో రాబోతోంది. వేచి ఉండండి’ అని పేర్కొంటూ.. ‘ప్రోబ్రషింగ్‌కు మారండి’ అని ఏడు సెకన్ల వీడియోను జత చేసింది. పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

* ఎల్‌అండ్‌టీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మరో మూడేళ్ల పాటు ఎ.ఎం.నాయక్‌ పునర్నియమితులయ్యారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. అయితే 2020 అక్టోబరు 1 నుంచి మరో మూడేళ్ల కాలానికి ఆయనను పునర్నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.