Food

మృగశిరలో మీనం పులుసు ఫేమస్!

Indian Telugu Style Fish Pulusu In Mrugasira Season

నేటి నుంచి మృగశిర ప్రారంభం కాబోతున్నది. ఈ కార్తె ప్రవేశం రోజు చేపలు తినడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నా, దీని వెనక ఆరోగ్యరహస్యమూ దాగి ఉన్నది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి.. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర మొదలవనున్నది. ఈ క్రమంలో మనిషి శరీరంలోనూ మార్పులు జరిగి, వ్యాధుల బారిన పడే ప్రమాదమున్నది. గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉన్నది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే, చేపలను తినాల్సిందే. అసలు ఈ చేపలకు.. మృగ శిరకార్తెకు ఉన్న సంబంధం ఏమిటీ..? తింటే ఏం ప్రయోజనం కలుగుతుంది..? తెలుసుకోవాలనుందా..? అయితే చదవండి..

*** ఇంటింటా చేపల పులుసే..
మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు.

*** ఫుల్‌ గిరాకీ..
మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ ఉంటుంది. గిరాకీతోపాటు రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు బయటి ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మే మత్స్యకారులు ఈ సారి రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘నీలి విప్లవం’తో చెరువుల్లో చేపల పంట పండడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కార్తె రోజు సాధారణ రోజుల కంటే కిలో చేప ధర రెట్టింపు పలుకుతుంది. బొమ్మె అయితే కూ.600 నుంచి వెయ్యి దాకా, రవ్వు, బొచ్చె, బంగారతీగ రకాలు 150 నుంచి రూ.200లకుపైగా, చిన్న జెల్లలు 500లకుపైనే విక్రయిస్తున్నారు.

*** వ్యాధుల నియంత్రణకు చేపలు
మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోయాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర ప్రారంభంలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నాం. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేగాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. అలా కాకుండా ఉండాలంటే.. చేపలను తినాల్సిందే. ఈ కార్తెలో పూర్వీకులు శాఖాహారులైతే ఇంగువను బెల్లంలో కలుపుకుని గోలిలాగా తయారు చేసుకొని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువ, చింత చిగురుతో కలుపుకుని తినేవారు.

*** పుష్కలమైనపోషకాలు
చేపలలో అనేక మాంసకృత్తులతోపాటు శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, కాపర్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మానవునికి కావాల్సిన అతి ముఖ్యమైన, రుచిని పెంచే లైసిన్‌, మిథియోనిన్‌, ఐసొల్యూసిన్‌ వంటి అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.
చేప కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా ఎవరైనా తినచ్చు. చేపల్లో ఉన్న కొవ్వులు (కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్స్‌) మన శరీర రక్త పీడనంపై (అంతిమంగా గుండెపై) మంచి ప్రభావం చూపుతాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. (థయామిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బయోటిన్‌, పెంటోదినిక్‌ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. సముద్ర చేపల కాలేయంలో (కాడ్‌ చేప) విటమిన్‌ ఏ, డీ, ఈ వంటి కొవ్వులో కరిగే విటమిన్స్‌ ఎక్కువగా లభిస్తుంది. చేపలలో పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నందున వైద్యులు గుండె సంబంధిత, అస్తమా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సిఫారసు చేస్తున్నారు. మన ప్రాంతంలో లభించే పరక, చందమామ కొడిప, ఇసుక దొందులు, పాపర్లను చింత చిగురుతో కలిపి వండి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణులు, చంటి పిల్లల తల్లులు తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పిల్లలకు సరిపడినంత పాల వృద్ధితోపాటు వ్యాధి నిరోధక శక్తి, నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్ర చేప అయిన కొర్రమీను(నల్ల చేప)లో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం కలిగి ఉంటుంది. దేశీయ మార్పు చేపల్లోని ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు హిమోగ్లోబిన్‌ సంశ్లేషణలో, రక్తం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మృగశిర కార్తెలో ఏ చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం కొవిడ్‌-19 నేపథ్యంలో స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం చాలా మంచిదని పలువురు మేధావులు చెబుతున్నారు.

*** మృగశిర కార్తె అంటే..
ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కోవిధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. దీంతో వాతావారణం ఒక్కసారిగా చల్లబడడం.. ప్రకృతిలో పలు మార్పులు జరిగే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు పునరుత్పత్తి అవుతాయి. మానవులలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు వచ్చి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి.

*** సులువుగా జీర్ణమవుతుంది.
మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. ముఖ్యంగా గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే చాలా మంచిది. ప్రకృతిలో మార్పులు జరిగినప్పుడు దానికి అనుగుణంగా శరీరంలోనూ మార్పులు వస్తాయి. అంటే.. రోహిణిలో ఎండలు విపరీతంగా ఉంటాయి. మృగశిర కార్తె రాగానే వాతావారణం ఒక్కసారిగా చల్లబడుతుంది. దీంతో.. మన శరీంలోనూ అలాంటి మార్పులే కనిపిస్తాయి. తద్వారా చాలా మంది వివిధ రకాల జబ్బుల బారిన పడతారు. కాబట్టి.. శరీర ఉష్షోగ్రతలను క్రమబద్ధీకరించుకోవాలంటే.. చేపలను తినడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు..చేపల ద్వారా అనేక పోషకాలు అందుతాయి. సులువుగా జీర్ణమవుతుంది.