భార్యపై వేధింపులు మానుకోవాలని మందలించాడనే కోపంతో మామపై అల్లుడు బాణంతో దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచుగూడెంలో జరిగింది. బైర్లూటి చెంచుగూడేనికి చెందిన బరమల బయ్యన్న తన కుమార్తె వీరమ్మను దోర్నాల మండలం కొర్రపోలూరుకు చెందిన ఉత్తలూరి చిన్నోడుకు ఇచ్చి వివాహం జరిపించారు. అల్లుడు మద్యానికి బానిసై వీరమ్మను తరచూ వేధిస్తుండటంతో బయ్యన్న కొద్ది రోజుల క్రితం కొర్రపోలూరు గ్రామానికి వెళ్లి అతడిని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న చిన్నోడు మద్యం తాగి శనివారం రాత్రి 10 గంటల సమయంలో బైర్లూటి చెంచుగూడెం వచ్చి మామతో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో వెంట తెచ్చుకున్న బాణాన్ని సంధించాడు. అది బయ్యన్నకు గుండె కింది భాగంలో దిగింది. కుటుంబ సభ్యులు అతడిని మొదట ఆత్మకూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఆదివారం గుంటూరు తీసుకెళ్లారు. ప్రాణాపాయ స్థితిలోనే దాదాపు 350కి.మీ. దూరం ప్రయాణించి గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వీరు చేరుకున్నారు. సీనియర్ వైద్యులు లేకపోవడంతో గంట సేపు స్ట్రెచర్‌పైనే ఉంచారు. గాయపడిన తరవాత దాదాపు 19 గంటలపాటు బాధితుడి శరీరంలో బాణం అలాగే ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైద్యులు బాణాన్ని కొంతమేర తొలగించారు. మిగిలిన భాగాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్యాణి శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. ప్రాణాపాయం లేదని చెప్పారు.
కూతురుని కొట్టొద్దంటే…మామపై బాణం వేసిన అల్లుడు
Related tags :