* పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.
* కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన దస్త్రంపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
* కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ఇందుకు బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4813కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 28 ఉండగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఒక్క కేసు ఉంది.
* ఏడాది కాలంలో జగన్ తెచ్చింది మాఫియా రాజ్యమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని.. దొంగల పాలన అని ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘జగన్ ఏడాది పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని రికార్డెడ్ వీడియోల్లో జగన్ ఊదరగొట్టడమే తప్ప.. ప్రజల్లోకి రావడం లేదు. ఏడాది పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై జనం నిలదీస్తారనే సీఎం జగన్ తప్పించుకుని తిరుగుతున్నారు’ అని యనమల విమర్శించారు.
* కార్పొరేషన్ల పరిధిలో పౌరుల కనీస అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు సంబంధించిన పనులపై మంత్రి హైదరాబాద్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పురపాలకశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
* ఓ చిరుతను చంపి శరీర భాగాలను ముక్కలుగా చేసిన ఘటన అసోంలో వెలుగుచూసింది. తమ మేకలు, కుక్కలు వంటి పెంపుడు జంతువులపై చిరుత దాడి చేస్తుండటంతో.. గువాహటిలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఫటాసిల్‌లో గ్రామస్థులు ఓ ఉచ్చును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు చిరుత దానిలో చిక్కుకుంది. అది గమనించిన అటవీశాఖ అధికారి జితేందర్‌కుమార్ గువహటి జూ అధికారులకు సమాచారమిచ్చారు. వారు రాకముందే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు చిరుతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
* సరిహద్దుల్లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన వివాదంగా మారకుండా, పరిష్కరించుకునేందుకు భారత్, చైనా సైన్యాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని సోమవారం చైనా వెల్లడించింది. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్దాఖ్‌లో కొద్దివారాలుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య మాల్డోలో సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో చైనా నుంచి తాజాగా ఈ ప్రకటన వెలువడింది.
* ప్రస్తుతం మన కార్లలో వాడే బ్యాటరీల జీవితకాలం 4-6 సంవత్సరాలు. ఆపై వాటి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. అదే విద్యుత్తు వాహనాల బ్యాటరీ విషయానికి వస్తే గరిష్ఠంగా 8-10 ఏళ్లు పనిచేస్తుంది. ఆపై కొత్తది కొనాల్సిందే. ఇది వినియోగదారుడికి ఓ భారమనే చెప్పాలి. దీనికి చైనాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ పరిష్కారం కనుగొంది. ఏకంగా 16 ఏళ్లపాటు వినియోగించగలిగే బ్యాటరీని ఆవిష్కరించింది. అంటే పదిలక్షల కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇవి మార్కెట్లోకి వస్తే గనక విద్యుత్తు వాహనాల చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది.
* తన తండ్రి బాలకృష్ణ జూన్ 10న పుట్టినరోజు జరుపుకోబోతున్న నేపథ్యంలో నారా బ్రాహ్మణి అభిమానులకు సందేశం ఇచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతున్న వీడియోను అభిమానులు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘నాన్న అభిమానులకు నమస్కారం.. మీరు నాన్న 60వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకొంటున్నారు. అలానే నాన్న వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఎంతో ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తూ, హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్ చేస్తున్నారు.
* టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించుకొనేందుకు బీసీసీఐకి సర్వహక్కులూ ఉన్నాయని వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ అన్నారు. ప్రయాణాలు, ప్రేక్షకులపై ఆంక్షలు విధించడమన్నది ఆస్ట్రేలియా ప్రభుత్వ ఇష్టమని పేర్కొన్నారు. బంతిపై మెరుపు రాబట్టేందుకు ఉమ్మిని ఉపయోగించడాన్ని నిషేధించడంతో ఇబ్బందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో మెగాటోర్నీపై అనిశ్చితి నెలకొంది. టోర్నీ వాయిదాపై ఈ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.