DailyDose

యస్ బ్యాంకుపై ఈడీ దాడులు-వాణిజ్యం

యస్ బ్యాంకుపై ఈడీ దాడులు-వాణిజ్యం

* యస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు సోమవారం భారీ తనిఖీలు నిర్వహించారు. మనీలాండరింగ్ ఆరోపణల కేసులో దర్యాప్తునకు సంబంధించి ముంబైలోని గ్లోబల్ టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్‌ కు సంబంధమున్న ఐదు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. ఈ సంగతిని ధృవీకరించిన సీనియర్ అధికారి దాడులు కొనసాగుతున్నాయనీ చెప్పారు. కాక్స్ అండ్ కింగ్స్ ప్రమోటర్ పీటర్ కెర్కర్‌కు మార్చిలోనే నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

* వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.ఆదివారం నాటి ధరలపై రూ.60 పైసలు మేర సోమవారం పెరిగాయి.దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ.71.86 నుంచి రూ.72.46కి, లీటరు డీజిల్‌ ధర రూ.69.99 నుంచి రూ.70.59కి చేరాయి.ఆయిల్‌ కంపెనీలు గతంలో ప్రతి నెలాఖరులో ధరలపై సమీక్ష జరిపి అంతర్జాతీయ ముడిచమురు ధరల మేరకు సవరించేంది.చివరిసారిగా మార్చి 16న ఈ డైనమిక్‌ రేటు విధానాన్ని అనుసరించాయి.

* కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో, ఇ-కామర్స్‌తో పాటు అధునాతన ట్రేడింగ్‌ విధానాలపై దృష్టి సారిస్తున్నట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహ్తా వాటాదార్లకు వెల్లడించారు. అధునాతన సాంకేతికతలు విక్రయాలను ప్రభావితం చేస్తున్నాయని, ప్రస్తుత ధోరణులను హెచ్‌యూఎల్‌ నిశితంగా పరిశీలిస్తోందని వివరించారు. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్‌ షెల్వ్స్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, అన్ని ప్లాట్‌ఫామ్‌లలో తమ ఉత్పత్తులు లభ్యమయ్యేలా చూస్తున్నామని వెల్లడించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, రిటైల్‌, ఇకామర్స్‌లో వినూత్న ఉత్పత్తులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘క్లీనిపీడియా’ ద్వారా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సూచనలు చేస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత బ్రాండ్లకూ ప్రచారం చేస్తున్నారు.

* హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ 2019-20లో రూ.19.42 కోట్ల వేతనం అందుకున్నారు 2018-19 నాటి రూ.18.88 కోట్లతో పోలిస్తే ఇది 2.86 శాతం అధికం.

* స్ట్రీమింగ్‌ సేవలు అందిస్తున్న డిస్నీ+హాట్‌స్టార్‌తో రిలయన్స్‌ జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రూ.401, అంతకుమించి విలువైన జియో రీఛార్జులతో రూ.399 విలువైన హాట్‌స్టార్‌ వీఐపీ+డీస్నీ ఏడాది చందాను ఉచితంగా అందించబోతోంది. రూ.401 నెలవారీ పథకంతో 90 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌, ఉచిత జియో యాప్‌లు 28 రోజుల పాటు అందించనుంది. రూ.2,599 రీఛార్జితో 740 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌, ఉచిత జియో యాప్‌లు 365 రోజులు అందించడంతో పాటు ఏడాది పాటు ఉచిత హాట్‌స్టార్‌ వీఐపీ+డిస్నీ చందా ఇవ్వనుంది. రూ.612 (రూ.51 విలువైన 12 డేటా ఓచర్ల కాంబో ప్యాక్‌) ప్లాన్‌ ఎంపికతోనూ ఏడాది పాటు ఈ ఉచిత చందాను ఆస్వాదించవచ్చని జియో ప్రకటించింది. డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ ద్వారా తాజా బాలీవుడ్‌ చిత్రాలు (బాఘి 3, అంగ్రేజీ మీడియం, తన్హాజీ), హిందీ, తమిళం, తెలుగులోకి అనువాదం చేసిన హాలీవుడ్‌ చిత్రాలు, షోలు, యానిమేషన్‌ చిత్రాలు, హాట్‌స్టార్‌ స్పెషల్స్‌, లైవ్‌ స్పోర్ట్స్‌ వంటివి చూడొచ్చని తెలిపింది.

* చమురు రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారత్‌ ఆకర్షణీయ గమ్యస్థానం అవుతుందని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. కొవిడ్‌-19 సంక్షోభం చల్లారి, పరిస్థితులు సాధారణంగా మారాక, విదేశీ పెట్టుబడిదార్లకు భారత్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని పేర్కొన్నారు. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చైనాపై అసంతృప్తిగా ఉన్న దిగ్గజ పెట్టుబడిదారులు భారత్‌కు వస్తారని విశ్లేషించారు. చమురు రంగంలో పెట్టుబడులకు ప్రపంచంలో అవకాశాలు పరిమితంగా ఉన్నాయని, పాశ్చాత్య దేశాల్లో అధికం చైనాకు వెళ్లేందుకు భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి చైనా వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతోందన్నది వారి వాదనగా గుర్తు చేశారు ఎగ్జాన్‌ మొబిల్‌, షెల్‌, బీపీ, సౌదీ ఆరామ్‌కో వంటి సంస్థలకు నిధుల లభ్యత పెరిగాక, ఇంధన వినియోగంలో ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న భారత్‌పై దృష్టి సారిస్తారని అంచనా వేశారు. 130 కోట్ల మంది ప్రజలతో, చైనాకు ప్రత్యామ్నాయం భారతేనని గుర్తిస్తారని పేర్కొన్నారు. కొంతమందికి బీపీసీఎల్‌పై ఆసక్తి ఉందనీ వివరించారు. తమ రిఫైనరీలు 83 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, విక్రయాలు కూడా 76 శాతానికి చేరాయని వెల్లడించారు