WorldWonders

ఏనుగుపై దాడి కావాలని చేసింది కాదు

ఏనుగుపై దాడి కావాలని చేసింది కాదు

కేరళలో పేలుడు పదార్ధాలు నింపిన ఆహారం తిని ఏనుగు మరణించిన ఘటన దేశమంతా అలజడి సృష్టించింది. అయితే పలువురు భావిస్తున్నట్టు ఆ ఏనుగుకు ఎవరూ ఉద్దేశపూర్వకంగా హానిచేయలేదని… ఈ ఘటన అనుకోకుండా జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ‘‘ఏనుగు యాదృచ్ఛికంగా ఆ కొబ్బరికాయను తిన్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ విషయమై కేంద్ర అటవీశాఖ, కేరళ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ… సవివరమైన మార్గదర్శకాలు జారీచేస్తోంది. నేరానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని… ఏనుగు మృతికి దారితీసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాము.’’ అని కేంద్ర పర్యావరణ శాఖ ఓ ప్రకటనలో తెలియచేసింది. గర్భిణిగా ఉన్న 15 సంవత్సరాల ఆడ ఏనుగు పేలుడు పదార్ధాలున్న పైనాపిల్‌ తినటంతో గాయపడి అనంతరం మరణించిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది తిన్నది పైనాపిల్‌ పండు కాదని, కొబ్బరి కాయ అని శవపరీక్షలో తేలింది. అంతేకాకుండా ఆ ఏనుగుకు గాయాలు తగిలి కనీసం రెండు వారాలు అయి ఉంటాయని తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న వారిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అడవి పందులు తమ పంటలను పాడుచేయకుండా నిరోధించేందుకు స్థానికులు పేలుడు పదార్ధాలను నింపిన పండ్లు, ఆహారాన్ని ఎరగా వాడతారు. అయితే ఈ విధానం అక్రమమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ అమానుష చర్యకు పాల్పడిన మిగిలిన వారిని వీలయినంత త్వరగా కనిపెట్టాల్సిందిగా, వన్యప్రాణులపై జరిగే నేరాలను దర్యాప్తు చేసే ప్రభుత్వ సంస్థ- ‘వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో’ ప్రధాన కార్యాలయానికి కేంద్రం ఆదేశాలు జారీచేసింది. కాగా, ఈ విషయానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దంటూ మంత్రి బాబుల్‌ సుప్రియో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.