ScienceAndTech

రాగిచెంబు టెక్నాలజీ రహస్యాలు

The health technology behind copper utensils

కరోనా గాల్లో ఎక్కువసేపు ఉండలేదు. దేనికో దానికి అతుక్కుని జీవించి ఉండటం దాని లక్షణం. అందులో భాగంగా ప్లాస్టిక్‌మీద రెండు నుంచి మూడు రోజులు జీవిస్తుంది. స్టెయిన్‌లెస్‌ స్టీలుమీదా రెండుమూడు రోజులపాటు బతికే ఉంటుంది. కానీ రాగిమీద కేవలం నాలుగు గంటలకే చనిపోతుంది. అందుకే అందరూ మరోసారి రాగి పాత్రలవైపు చూస్తున్నారు.
*ఇరవై ముప్ఫై సంవత్సరాల క్రితం… బామ్మలూ తాతలూ అందరూ రాగిచెంబులో నీళ్లు నింపుకుని ఉదయాన్నే తాగేవాళ్లు. కొందరి ఇళ్లలో రాగి బిందెలూ కనిపించేవి. క్రమంగా వాటి స్థానంలో స్టీలుబిందెలు వచ్చేశాయి. ఫ్రిజ్‌లూ ప్లాస్టిక్‌ వాటర్‌బాటిళ్లూ ప్రవేశించాయి. యూవీ ఫిల్టర్లూ ఆర్‌వో ప్యూరిఫ్లయిర్లూ కూడా రావడంతో రాగి అవుటాఫ్‌ ఫ్యాషన్‌ అయిపోయింది. అయితే అటక ఎక్కించిన ఆ రాగిబిందెల్ని ఇప్పుడు మళ్లీ కిందకి దించుతున్నారు. కొత్తగా వస్తోన్న రాగి బాటిళ్లనీ కొంటున్నారు. అంతేనా… పిల్లల పాలసీసా నుంచి పెద్దవాళ్లు వాడే కప్పులూ గ్లాసుల వరకూ అన్నీ రాగివే కావాలంటున్నారు. మొత్తమ్మీద వంటింట్లో వాడే పాత్రలన్నీ కూడా రాగి వర్ణంలో తళతళలాడుతున్నాయి. కొందరయితే వంటగదిలోని అరల్ని సైతం రాగి రేకుతోనే చేయిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆయుర్వేదం ప్రకారం రాగి ఎంతో మంచిదని అనేక శాస్త్రీయ పరిశీలనల్లో తేలడంతో రాగి వస్తువుల్నే సరికొత్తగా వాడుతోంది ఈతరం.పైగా రాగి పాత్రలో వండటం వల్ల వేడి కింద నుంచి పై వరకూ అన్నివైపులా సమానంగా తగులుతుంది. మిగిలిన ఏ పాత్రల్లోనూ ఇది సాధ్యపడదు. అందుకే షెఫ్‌లు తాము చేసే వంటలకి ఎక్కువగా కాపర్‌ పాత్రల్నే వాడతారు. తరతరాల నుంచీ చేసే ఆయుర్వేద వైద్యం కోసం ఇప్పటికీ రాగి పాత్రల్నే వాడుతుంటారు. ప్రాచీన ఈజిప్షియన్లూ అజ్‌టెక్‌లూ కూడా అనేక వ్యాధుల నివారణలో కాపర్‌ను వాడేవారట. దాంతో ఇప్పుడు వండేవాటితోబాటు తినడానికి వాడే ప్లేట్లని కూడా తామ్రంతోనే చేస్తున్నారు.
***కాపర్‌తో లాభాలెన్నో..!
శరీరంలో ఐరన్‌ లోపిస్తే రక్తంలో హీమోగ్లోబిన్‌ తగ్గుతుంది. అదే ఐరన్‌ను శరీరం తీసుకోవాలంటే కాపర్‌ అవసరం. అంటే మనిషి ఆరోగ్యానికి కీలకమైన ఖనిజాల్లో రాగి ఒకటి. రాగి మూలకాన్ని మానవ శరీరం తయారుచేసుకోలేదు. ఆహారం లేదా నీళ్ల ద్వారా తీసుకోవాల్సిందే. ఈ విషయం మన పూర్వికులకి ముందే తెలుసు. అందుకే రాగి బిందెల్లో నీటిని నిల్వచేసుకుని తాగేవారు. అంతెందుకు… పూజలో భాగంగా వాడే ఉద్ధరిణి కూడా రాగితో చేసినదే ఉంటుంది. నిజానికి మన ఆయుర్వేదం అనేకాదు, ఆధునిక శాస్త్రీయ పరిశీలనలూ ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. రాగిచెంబు లేదా పాత్రలో కనీసం నాలుగు గంటలపాటు నిల్వచేస్తే ఆ నీళ్లలోకి కొంత రాగి చేరుతుంది. దానివల్ల ఆ నీటిలోని ఫంగస్‌, ఆల్గే, బ్యాక్టీరియా… వంటి హానికర సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. ఈ గుణాన్ని కలిగి ఉండటం వల్లే రాగిని ఆలిగో డైనమిక్‌ అనీ పిలుస్తుంటారు. అంతేకాదు, సార్స్‌, మెర్స్‌… వంటి వైరస్‌లన్నీ మిగిలిన పదార్థాలమీద ఎక్కువకాలం జీవిస్తే రాగిమీద త్వరగా చనిపోతాయని సౌతాంప్టన్‌ పరిశోధకులు ఐదేళ్ల క్రితమే తేల్చి చెప్పారు. దీనికి యాంటీ క్యాన్సర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలూ ఉన్నాయి. ముఖ్యంగా పొట్టలోని హానికర పదార్థాలన్నింటినీ పంపించే గుణం కాపర్‌కి ఉంది. అల్సర్లనీ అజీర్తినీ ఇన్ఫెక్షన్లనీ కూడా కాపర్‌ తగ్గిస్తుందట. కాలేయం, మూత్రపిండాల్లోని వ్యర్థాల్ని తొలగించేందుకూ రాగి లోహం దోహదపడుతుంది.
* క్రమం తప్పకుండా రాగి పాత్రలోని నీటిని తాగితే బరువు కూడా పెరగరు. ఎందుకంటే ఇది కొవ్వుకణాల్ని విభజించడంతోబాటు వాటిని బయటకు పంపించేందుకూ తోడ్పడుతుంది. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా ఇది పుండ్లనీ నివారిస్తుంది.
* బీపీనీ గుండె వేగాన్నీ చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గించేందుకూ రాగి సహాయపడుతుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది.
* కళ్లూ జుట్టూ చర్మ రంగుకీ వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకూ కారణమైన మెలనిన్‌ ఉత్పత్తికీ రాగి ఎంతో అవసరం. కొత్త చర్మకణాల ఉత్పత్తికీ కాపర్‌ కావాల్సిందే.
* థైరాయిడ్‌ పనితీరునీ క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవాళ్లలో కాపర్‌ తక్కువగా ఉంటున్నట్లు అనేక పరిశీలనల్లోనూ స్పష్టమైంది. ఎముకల బలానికీ రోగనిరోధకశక్తిని పెంచేందుకూ ఆర్థ్రయిటిస్‌, కీళ్లనొప్పులు తగ్గడానికీ కూడా రాగి తోడ్పడుతుంది.
* రోజూ రాగిచెంబులోని నీళ్లు తాగినవాళ్లకి ముఖం మీద ముడతలు త్వరగా రావట.
ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే అమెరికాకి చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించి కాపర్‌ కలిపిన 275 లోహాలను యాంటీమైక్రోబియల్‌ పదార్థాలుగా వాడేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో వంట పాత్రలకే రాగి పరిమితం కావడం లేదు.ఆసుపత్రులూ షాపింగుమాల్సూ ఆఫీసులూ ఇళ్లూ అంతటా కాపర్‌ వాడకం పెరిగింది. డోర్‌ హ్యాండిల్సూ సోప్‌హోల్డర్లూ వాటర్‌ ట్యాపులూ బెడ్‌ రెయిలింగులూ కుర్చీలూ ఇలా అన్నింటినీ కాపర్‌తో తయారుచేస్తున్నారు. కొందరు ఇంటీరియర్‌ డిజైనింగులోనూ అలంకరణ వస్తువుల్లో కూడా కాపర్‌ను మెరిపిస్తున్నారు. పూలకుండీలకీ కాపర్‌నే వాడటం విశేషం. మొబైల్‌ఫోన్లూ టెలీఫోను హ్యాండ్‌సెట్లూ ఒకటనేముంది… అన్నింటికీ కాపర్‌ను వాడుతున్నారు. ఫ్రిగో వంటి కొన్ని కంపెనీలయితే కాపర్‌ షీట్లతో డిష్‌వాషర్లూ ఫ్రిజ్‌లూ రూపొందిస్తున్నాయి. ఇంట్లోని వస్తువులతోబాటు ఎవరికి వాళ్లు వాడుకునే దువ్వెనలూ పెన్నులూ బ్రేస్‌లెట్లూ కళ్లద్దాల ఫ్రేములూ వంటి యాక్సెసరీలతోబాటు ఆభరణాల్లోనూ రాగి వాడకం పెరుగుతోంది. అంతేకాదు, స్టీలు మాదిరిగానే రాగిమీదా రంగులడిజైన్లను పెయింటు కూడా చేస్తున్నారు. దాంతో రాగి బాటిళ్లూ కప్పులూ గ్లాసులూ అన్నీ అందంగా రూపొందుతున్నాయి.
****రాగి… రక్ష రేకు!
పూర్వం రకరకాల మానసిక సమస్యలతోనూ మూర్ఛరోగాలతోనూ బాధపడేవాళ్లకి రాగితో చేసిన చిన్న రక్ష రేకుని కట్టేవారు. అది నమ్మకమే కావచ్చుగాక, కానీ దాని వెనుక ఓ శాస్త్రీయకోణం ఉంది. రాగిరేకు వల్ల మెదడు పనితీరు మెరుగవడంతోబాటు మూర్ఛని తగ్గించే గుణం కాపర్‌కి ఉందని శాస్త్రీయ పరిశీలనల్లోనూ తేలింది. దీనికి మానసిక స్థైర్యాన్ని పెంచే సామర్థ్యం కూడా ఉందట. బంగారం చేయించుకోగల స్థోమత ఉన్నా సిక్కులు ఎక్కువగా రాగితో చేసిన కడా ధరించడానికే కారణం కూడా ఇదే కావచ్చు. సూర్యుడు, ఇతర గ్రహాల నుంచి వచ్చే శక్తిమంతమైన కిరణాలను రాగి కడియం గ్రహించి శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. పైగా దీన్నుంచి శరీరం కొంచెంకొంచెంగా రాగిని గ్రహించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందుకేనేమో రాగి ఆభరణాల్నీ ధరించే ఆచారం ఇప్పటికీ కొన్నిచోట్ల వాడుకలో ఉంది. ఇవన్నీ చూసే కాబోలు… నేటితరం మళ్లీ రాగివైపు ఆకర్షితమవుతోంది. ఇదండీ సంగతి… రాగి ఆరోగ్యానికి ఎంత రక్షణో తెలిసిపోయిందిగా మరి..!