Fashion

జడలతో అందం…

TNILIVE Telugu Fashion News || Hair Braids Fashion In Summer

మొహం నుంచి కాలి చివరి వరకూ.. అలంకరణలో ప్రాధాన్యం ఇస్తాం. జడను మాత్రం పట్టించుకోం. కొప్పున్న అమ్మ ఎలా ముడిచినా బాగుంటుందని.. ముడేసుకునో జడేసుకునో.. పని అయిపోయిందని సంతోషపడతాం. మహా అయితే పూలు తురిమి మురిసిపోతాం. కానీ జడ వేసినా, కొప్పు ముడిచినా ఇంకాస్త అందంగా ఉండేలా… అదనపు సొగసులు సమకూరేందుకు ముచ్చటైన యాక్సెసరీస్‌ అందుబాటులోకి వచ్చాయి. చీర కట్టు నుంచి లెహంగాల వరకూ దేశీ స్టయిల్‌లో.. ఎలాంటి సాధన సంపత్తిని వాడాలో మీరే తెలుసుకోండి..
*పూల జడలా..
పెండ్లి, పేరంటాల్లో పూలజడ మామూలే. కానీ కొందరికి పూలు పెద్దగా ఇష్టం ఉండవు. ఎక్కువ సేపు అయితే వాడిపోతాయని భయపడతారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే కృత్రిమ జడలు. పైగా పెండ్లికూతుళ్లే కాదు.. బంధువులంతా ఇలాంటి జడలనే ఇష్టపడతారు. లేస్‌, సిల్వర్‌, గోల్డ్‌, స్టోన్‌ వర్క్‌తో వచ్చే ఈ పూర్తి జడ పైన మల్లెపూలు తురుముకుంటే సరిపోతుంది. ముత్యాలు, రత్నాభరణాలతో వచ్చేవి కాస్త ధర ఎక్కువ పలుకుతున్నాయి. పట్టుచీరల మీదకి ఈ జడలు పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి.
*నగలతో నయగారాలు
నగల్ని మెడలో మాత్రమే వేసుకోవాలా? కొప్పులను కూడా ఆభరణాలతో అలంకరించుకునే రోజులు వచ్చాయి. మీ అవుట్‌ ఫిట్‌కి మ్యాచ్‌ అయ్యేలా కూడా డిజైన్‌ చేసుకోవచ్చు. ఇతర నగలను పోలినట్టు ఉండేలానూ చూసుకోవచ్చు. మీ దగ్గర బుట్ట కమ్మలు ఉంటే, వాటినీ కొప్పు మీద పెట్టేయవచ్చు. చంద్రవంక, సూర్యవంక.. ఇలా ఇతర సంప్రదాయ నగలు కూడా కొప్పును మరింతం సూపర్‌గా తీర్చిదిద్దుతాయి.
* ‘బ్రోచ్‌’ బాగుందా
జడ వేస్తే కట్టేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా పోనీటెయిల్‌, కొప్పు వేసినప్పుడు… మగవాళ్లు కోటుకు పెట్టుకునే, బ్రోచ్‌లను జడకు సింగారించుకోవచ్చు. స్టోన్స్‌తో అందంగా మెరిసిపోతూ ఉంటుంది బ్రోచ్‌. ఎవరి సహాయం లేకుండానే, బ్రోచ్‌ని మీరే జడకు పెట్టుకోవచ్చు. వీటిలోనూ సైజులు ఉంటాయి. జుట్టు పొడవును బట్టి బ్రోచ్‌ని ఎంపిక
చేసుకోవాలి.
*పిన్నులతోనూ..
జుట్టు పడిపోకుండా హెయిర్‌ పిన్స్‌ పెట్టుకోవడం మామూలే. అవీ రకరకాలుగా వస్తున్నాయి. కృత్రిమ పువ్వుల పిన్నులూ, ఇతర ఫ్యాన్సీ పిన్నీసులూ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. క్రిస్టల్స్‌, రంగు రాళ్లు, ముత్యాలు కలగలిపిన హెయిర్‌ పిన్స్‌ కూడా ఉంటున్నాయి. వీటిని రకరకాల హెయిర్‌ స్టయిల్స్‌కు అనుగుణంగా పెడితే, ఆ జడతో పాటు ఇవీ
అదిరిపోతాయి.
*తీగ మల్లెలా..
లెహంగాలో, చుడీదార్లో వేసుకున్నప్పుడు జుట్టును ఎక్కువగా తీర్చిదిద్దాల్సిన పని ఉండదు. సన్నని చైన్‌ల లాంటి హెయిర్‌ యాక్సెసరీస్‌ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వాటిని ఎంచుకోవచ్చు. ఈ తరహా చెయిన్‌లకి చివర పెండెంట్స్‌ కూడా ఉంటాయి. జుట్టు విరబోసుకున్నప్పుడు పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు.