Politics

సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేయనున్న కేసీఆర్

సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేయనున్న కేసీఆర్

గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని కాపాడే విషయంలో ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్‌ పోస్టులను నూటికి నూరుశాతం స్థానిక గిరిజనులకే కేటాయిస్తూ ఇచ్చిన జీవోను (జీవో నంబరు 3/2000) సుప్రీంకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్లు తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి వెంటనే పిటిషన్‌ వేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల స్థానిక గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వ విప్‌ రేగ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలల్లో స్థానికులనే ఉపాధ్యాయులుగా నియమించేలా ప్రభుత్వం 2000 సంవత్సరంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టుకెళ్లగా విచారణల అనంతరం ఇటీవల సుప్రీంకోర్టు ఈ జీవోను కొట్టేసింది. సుప్రీం ఆదేశాల వల్ల స్థానిక ఎస్టీలకు నష్టం జరుగుతుందని తెరాస ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 1950 జనవరి 26కు ముందు నుంచి స్థానికంగా నివాసముంటున్న ఎస్టీలకు స్థానిక ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్‌ ఇచ్చే పద్ధతి ఉందని, దీనివల్ల ఎస్టీలు కొద్దో గొప్పో ప్రయోజనం పొందారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని వారు అభ్యర్థించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.