* కొవిడ్ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. కొవిడ్-19కు సంబంధించి అంతర్జాతీయ గణాంకాల సంస్థ ‘వరల్డోమీటర్’ వివరాల ప్రకారం… విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య పరంగా అమెరికా (16,907) తొలి స్థానంలో ఉండగా… 8,944 కేసులున్న భారత్‌దే ద్వితీయ స్థానం. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న బ్రెజిల్‌లో కేసులు భారత్‌కంటే మూడురెట్లు అధికమైనప్పటికీ… సీరియస్ కేసులు మన కంటే తక్కువగా ఉన్నాయి. ఇక రష్యాలో సీరియస్ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతుగా ఉంది.
* మృతి చెందిన వారికి కొవిడ్ పరీక్షలు చేయాలనడం అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మృతులందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడినవారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకిన వారందరినీ బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
* రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు రాబోయే విద్యాసంవత్సరానికి బోధనాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాం’’ అని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.
* ‘పశ్చిమ మీడియా కొవిడ్-19పై ఓవర్ యాక్షన్ చేస్తోంది’ ఇది ఫిబ్రవరిలో ఐరోపా, అమెరికా పత్రికలపై చైనా మౌత్‌పీస్ ‘గ్లోబల్‌టైమ్స్’ రాసిన కథనం. ఈ పత్రికలో కథనం వస్తే.. అది ప్రభుత్వ అభిప్రాయం కిందే పరిగణించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేసి.. భయపెట్టి వ్యూహాత్మక ప్రయోజనాలు పొందడానికి అక్కడి ప్రభుత్వం ఈ పత్రికను వాడుకొంటుంది. ఈ పత్రిక ప్రతిదానికీ చైనా దృష్టిలో భాష్యం చెబుతుంది. కరోనా పుట్టుకే తీసుకొంటే.. ఈ వైరస్‌ను నవంబర్‌లోనే ఇటలీలోని వైద్యులు కనుగొన్నారని ట్వీట్ చేసింది. ఆ తర్వాత దానిపై పెద్దగా ఆధారాలు చూపించలేకపోవడంతో ఆ వాదన నుంచి వెనక్కి తగ్గింది. భారత్‌తో సరిహద్దు వివాదాల సమయంలో గ్లోబల్ టైమ్స్ దుందుడుకు కథనాలను ప్రచురించింది.
* మురుగు నీటిలో కరోనా వైరస్ ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్, అమెరికా, స్వీడన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో మురుగులో వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. తాజాగా భారత్‌లోనూ మురుగునీటిలో వైరస్‌కు సంబంధించిన జన్యువులు ఉన్నట్లు కొనుగొన్నారు. పలు అంరత్జాతీయ సంస్థలతో కలిసి ఐఐటీ-గాంధీనగర్ దీనిపై పరిశోధనలు జరిపింది. అహ్మదాబాద్‌లోని ఓ మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద నమూనాలను సేకరించి పరీక్షించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై టీడీపీ ఛార్జిషీట్ వేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఉరిశిక్ష వేసిన సంగతి టీడీపీ గుర్తుంచుకోవాలని చురకలు అటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చారని ప్రశంసించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారని చెప్పారు. సామాజిక పెట్టుబడి అవశ్యకతను సీఎం జగన్ గుర్తించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.
* కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం తప్పదన్నఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకూ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన అమెరికాకు సంబంధించి అధికారిక షాకింగ్ రిపోర్టు వెలువడింది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ ఫలితంగా గత ఫిబ్రవరిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి ప్రవేశించిందని ఆర్థిక నిపుణుల తాజా పరిశోధనలో వెల్లడైంది.
* ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయటపడింది. చైనాలో ఉద్భవించిన దీని గురించి గతేడాది డిసెంబర్‌లోనే ప్రపంచానికి తెలిసినప్పటికీ, అంతను మునుపే ఆ దేశంలో వైరస్ విజృంభణ మొదలైందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సాటిలైట్ నుంచి తీసిన ఫొటోల ద్వారా గతేడాది ఆగస్టు నుంచే కరోనా ఉనికి ప్రారంభమైందని తెలిపింది. కిక్కిరిసిన ఆసుపత్రులు- పార్కింగ్, అక్కడి జనాభా సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన పదాల ఆధారంగా ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఈ విషయాన్ని వెల్లడించింది.