DailyDose

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం

TNILIVE Business News Roundup Today || Indian Stock Markets Close In Losses

* నిన్న స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సూచీలు మంగళవారం భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 413 పాయింట్లు నష్టపోగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 10,046 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ వద్ద కొనసాగుతోంది.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆఫర్లను ప్రకటిస్తోంది. తన ‘ఎస్‌ప్రెస్సో’ రకం కారుపై రూ.48,000 తగ్గింపును ప్రకటించింది. దీని ప్రకారం డీలర్‌ వద్ద కస్టమర్‌కు నేరుగా రూ.20వేల మేరకు క్యాష్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతోపాటు పాతవాహనానికి ఎక్స్‌ఛేంజి చేసి మరో రూ.20 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వీటికి తోడు యాక్ససిరీస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ వంటివి మరికొన్ని కలిపి మరో రూ.8,000 వరకు వినియోగదారుడికి మిగలనుంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.69 లక్షల నుంచి టాప్‌ఎండ్‌ ధర రూ.4.91లక్షల వరకు ఉంది.

* తమ వినియోగదారులకు వాహన రుణాలు అందించే విషయమై మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ).. మహీంద్రా ఫైనాన్స్‌తో చేతులు కలిపింది. కరోనా సంక్షోభంతో ద్రవ్య లభ్యత సమస్య ఎదుర్కొంటున్న వినియగదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందం కుదుర్చుకొన్నట్లు ఎంఎస్‌ఐ తెలిపింది. మహీంద్రా ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా పటిష్ఠమైన నెట్‌వర్క్‌ ఉందని వెల్లడించింది. గ్రామీణ, సెమీ-రూరల్‌ సహా మరికొన్ని వర్గాల ఆదరణ చూరగొందని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మారుతీ రిటైల్‌ విక్రయాల్లో మూడో వంతు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం వినియోగదారులకు మరింత చేరవయ్యేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ‘బై నౌ-పే లేటర్‌’, ‘స్టెప్‌ అప్‌ ఈఎంఐ’, ‘బెలూన్‌ ఈఎంఐ’ వంటి ఆఫర్లతో వినియోగదారులు సైతం లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వేతన, స్వయం ఉపాధి, రైతులు, వ్యాపార ఇలా అన్ని వర్గాల వారికి ఈ భాగస్వామ్యం వల్ల లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఐకి దేశవ్యాప్తంగా 3,086 షోరూంలు ఉండగా.. మహీంద్రా ఫైనాన్స్‌ 1,450 శాఖలతో విస్తరించింది.

* కార్పొరేట్‌ పన్నులో కనిష్ఠమైన 15 శాతాన్ని పొందేందుకు కొత్త కంపెనీలకు నిర్దేశించిన గడువు తేదీని ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే ఉద్దేశంతో గత సెప్టెంబరులో కార్పొరేట్‌ పన్నును 10 శాతం వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. 2019 అక్టోబరు 1 తర్వాత వ్యవస్థాపితమైన కొత్త కంపెనీలకు, 2024 మార్చి 21లోగా కార్యకలాపాలు ప్రారంభించే కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 25 శాతం నంచి 15 శాతానికి సవరించింది. కార్పొరేట్‌ పన్నును ఇంత భారీగా తగ్గించడం గత 28 ఏళ్లలో ఇదే తొలిసారి. ‘కొత్త పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్‌ పన్ను నుంచి ప్రయోజనం పొందాలని తాము కోరుకుంటున్నాం. అందుకే 2023, మార్చి 31 గడువు తేదీని పొడించే అంశాన్ని పరిశీలిస్తున్నామ’ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఫిక్కీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భారత వ్యాపార సంస్థలకు సహకారం అందించేందుకు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కొవిడ్‌-19 అత్యవసర రుణ సౌలభ్యాన్ని కేవలం ఎంఎస్‌ఎమ్‌ఈలే కాకుండా అన్ని కంపెనీలూ వినియోగించుకోవచ్చని తెలిపారు.

* పర్యాటక సేవల కంపెనీల కాక్స్‌ అండ్‌ కింగ్‌ ప్రమోటరు, డైరెక్టర్ల కార్యాలయాలు సహ ఐదు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం సోదాలు నిర్వహించింది. యెస్‌ బ్యాంక్‌ మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తు వ్యవహారంలో భాగంగా ఈ తనిఖీలను చేపట్టినట్లు ఈడీ బృందం పేర్కొంది. కాక్స్‌ అండ్‌ కింగ్‌ ప్రమోటరు అజిత్‌ పీటర్‌, డైరెక్టర్లు పెసి పటేల్‌, అభిషేక్‌ గోయెంకా, మాజీ సీఎఫ్‌ఓ అనిల్‌ ఖండేల్‌వాల్‌, ఆడిటర్‌ నరేశ్‌ జైన్‌ కార్యాయాల్లో సోదాలు జరిగాయి. ఈడీ దర్యాప్తు ప్రకారం.. యెస్‌ బ్యాంక్‌కు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ అతిపెద్ద రుణగ్రహీత. యెస్‌ బ్యాంక్‌కు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ దాని అనుబంధ సంస్థలు కలిసి రూ.3,642 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాక్స్‌ అండ్‌ కింగ్‌ బకాయిల విలువ రూ.563 కోట్లు కాగా.. ఈజీగో వన్‌ ట్రావెల్‌ రూ.1,012 కోట్లు, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.422 కోట్లు, ప్రమోథియన్‌ ఎంటర్‌ప్రైస్‌, రూ.1,152 కోట్లు, మాల్‌వెర్న్‌ ట్రావెల్‌ రూ.493 కోట్లు చొప్పున కట్టాల్సి ఉంది. కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు సేకరించే ఉద్దేశంతో మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. దేశీయంగా, విదేశాల్లోనూ అనుబంధ సంస్థల ద్వారా రుణాలు తీసుకొని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ నిధుల మళ్లింపునకు పాల్పడిందన్నది ఈడీ ఆరోపణ. కాగా.. యెస్‌ బ్యాంక్‌ ఇచ్చిన రుణాల్లో చాలా వరకు నిరర్థక ఆస్తులుగా మారిన కేసుకు సంబంధించి ఆ బ్యాంకుపైనా, మరికొన్ని దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలపైనా ఈడీ దర్యాప్తు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

* మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ పీవీఆర్‌ వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టింది. కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో వ్యాపారంపై ప్రభావం పడటంతో వేతనాలు, ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంట్లనూ వాయిదావేసినట్లు సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సినిమాల నిలిపివేత కారణంగా సినిమా ప్రదర్శన, దానికి సంబంధించిన వ్యాపారాల నుంచి తమకు ఎటువంటి ఆదాయం రాలేదని కంపెనీ తెలిపింది. దీంతో తమ లాభదాయకత, నిధుల లభ్యతపై గణనీయ ప్రభావం పడిందని పేర్కొంది. తిరిగి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగొచ్చని వెల్లడించింది. అందుకే వ్యయ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ సమయంలో లేఆఫ్‌ల ద్వారా సిబ్బంది సంఖ్యను తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివిధ స్థాయిల్లోని ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించినట్లు పేర్కొంది. మరోవైపు రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు పీవీఆర్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.