Sports

సచిన్ వీరూల కన్నా నేను చాలా తక్కువ

సచిన్ వీరూల కన్నా నేను చాలా తక్కువ

ఒకప్పటి తన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తే ఈనాటి క్రికెట్లో కొనసాగడం కష్టమని టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ప్రస్తుతం డిఫెన్సివ్‌ టెక్నిక్‌ విలువ తగ్గినప్పటికీ అవసరం మాత్రం తగ్గలేదన్నారు. కోహ్లీ, రోహిత్‌ వన్డేల స్వరూపాన్ని సమూలంగా మార్చేశారని ప్రశంసించారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఛెతేశ్వర్‌ పుజారా వంటి ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు. మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో వీడియోకాస్ట్‌లో ద్రవిడ్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

‘సుదీర్ఘ సమయం క్రీజులో పాతుకుపోయి లేదా బౌలర్లను అలసిపోయేలా చేసి లేదా సంక్లిష్ట పరిస్థితుల్లో కొత్త బంతి మెరుపు పోగొట్టిన తర్వాత పరుగులు రాబట్టడమే నేను చేసింది. నా పనదే. దాన్ని చేసేందుకు గొప్పగా గర్వపడేవాడిని. అంటే.. వీరేంద్ర సెహ్వాగ్‌లాగా షాట్లు ఆడటం నాకిష్టం లేదని అర్థం కాదు. నా ప్రతిభ భిన్నమైంది. అంకితభావం, ఏకాగ్రతతో ఆడటమే నా నైపుణ్యాలు. నేను వాటిపైనే పనిచేశాను’ అని ద్రవిడ్‌ అన్నారు. కెరీర్‌లో ‘మిస్టర్‌ వాల్‌’ 300కు పైగా వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే. తన రోజుల్లో మాదిరిగా బ్యాటింగ్‌ చేస్తే ఇప్పుడు కొనసాగడం కష్టమేనని ఆయన అన్నారు.

‘ఒకసారి స్ట్రైక్‌రేట్లు చూడండి. వన్డేల్లో నా స్ట్రైక్‌రేట్‌ సచిన్‌, సెహ్వాగ్‌ కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో స్థాయి అది. ఏదేమైనా నేను రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పోల్చుకోలేను. ఎందుకంటే వారు వన్డేల స్వరూపమే మార్చేశారు. ఆటను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే నేను టెస్టు ఆటగాడినే కావాలనుకున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.