Movies

రెండేళ్ల పిల్లలను ఎందుకలా హింసిస్తున్నారు?

రెండేళ్ల పిల్లలను ఎందుకలా హింసిస్తున్నారు?

రెండేళ్ల పిల్లలకు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు ఎందుకు నిర్వహిస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని నటి రాధికా శరత్‌ కుమార్‌ అన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలను బోధిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ప్లే స్కూల్స్‌ కూడా చిన్నారులకు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘మా రెండున్నరేళ్ల బాబు తన ప్లే స్కూల్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాస్‌కు హాజరయ్యాడు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన రాధిక.. ‘‘పాఠశాలలు రెండేళ్ల పిల్లలకు ఈ ఆన్‌లైన్ తరగతులు ఎందుకు నిర్వహిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఈ వయసులో వారి జ్ఞాపకశక్తి ఎంత ఉంటుంది? తల్లిదండ్రులు ఇలాంటివి ప్రోత్సహించకూడదు’’ అని ట్వీట్‌ చేశారు.