తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు భారత్, చైనా బుధవారం మరోసారి చర్చలు జరిపాయి. మేజర్ జనరల్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో ఫలప్రదంగా చర్చలు సాగినట్లు సీనియర్ సైనికాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించడంతోపాటు, సరిహద్దుల నుంచి తక్షణమే చైనా తన బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్ బృందం డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో రెండు దేశాలు పరిమిత సంఖ్యలో బలగాల ఉపసంహరణను ప్రారంభించిన మరుసటి రోజే ఈ చర్చలు జరిగాయి. అయితే పాంగాంగ్, దౌలత్‌బేగ్ ఓల్డీ, దెమ్‌చోక్‌లో మాత్రం బలగాలు కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యపై ఈనెల 6న ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలూ చర్యలు ప్రారంభించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ బుధవారం తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే చైనా ఆక్రమణలు: లడఖ్ ఎంపీ
లడఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందా? అంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్ష్యంగా రాహుల్ మంగళవారం చేసిన ట్వీట్‌పై బీజేపీ లడఖ్ ఎంపీ జమ్యాంగ్ షెరింగ్ నమ్‌గ్యాల్ స్పందించారు. ‘అవును. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. అయితే కాంగ్రెస్ హయాంలో’ అని తిప్పికొట్టారు. ఏయే సమయంలో ఎక్కడెక్కడ ఆక్రమణలకు పాల్పడిందో కూడా ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి ఒక మ్యాప్‌ను జతపరిచారు.
ప్రధాని మౌనమేల?: రాహుల్
సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. లడఖ్‌లోని మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదని, అయినప్పటికీ దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. గాల్వన్‌లోయ, పాంగాంగ్ తమవే అని చైనా పేర్కొంటున్నవార్తాకథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు.