తెలంగాణలో వరుసగా అన్ని ఎన్నికల్లోనూ చతికిలపడిన కాంగ్రెస్ నేతలకు పీపీసీ అధ్యక్ష రేసు కొన్నినెలలుగా వినోదాన్ని పంచుతున్నది. పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నదన్న వార్తలు వచ్చినప్పుడల్లా ఆశావాహల అనుకూల, వ్యతిరేకవర్గాలు లేఖాస్ర్తాలు సంధిస్తుండటంతో అధిష్ఠానం కూడా వినోదమే ‘ఉత్తమం’ అన్నట్టు సందిగ్ధాన్ని కొనసాగిస్తున్నది. పరిణామాలన్నీ అనుకూలంగా వీస్తున్నాయనే అంచనాలతో ఉత్తమ్‌లో ఆశలు చిగురిస్తుండగా.. రేవంత్‌కు ‘ఉత్త’ చేయే మిగులుతుందని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతి ఎన్నికల్లోనూ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మార్చవచ్చంటూ ఊహాగానాలు వచ్చినా.. వరుసగా ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆ సాహసం చేయలేకపోయింది. హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పరాజయంతో ఓటమి సంపూర్ణం కావడంతో పీసీసీ నుంచి తప్పుకుంటున్నానంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్టానానికి రాజీనామా లేఖ పంపించారు. అది దరిమిలా నేటివరకు అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠా నం వేచిచూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నది. పీసీసీ పీఠంకోసం బహిరంగంగా కొందరు.. బయటపడకుండా మరికొందరు సీనియర్లు కుస్తీ పడుతున్నారు. అయితే వీరంతా డబుల్ స్టేట్మెంట్లు ఇవ్వడం అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేస్తున్నది.
తమకు పదవి ఇవ్వాలని.. లేకపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కొనసాగించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ ఇవ్వొద్దని, తాను రాహుల్‌గాందీకి నేరుగా లేఖ రాస్తానని బహిరంగంగానే ప్రకటించారు. సీనియర్ నేత వీ హనుమంతరావు సైతం ‘రేవంత్‌కు వ్యక్తిగత ఎజెండా తప్ప.. పార్టీని బలోపేతం చేసే ఎజెండా అనేదే ఉండదని, ఆయనకు పీసీసీ ఇస్తే పార్టీ పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని’ చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలా సీనియర్ల అభిప్రాయాలతో హస్తిన నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తున్నది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ తామూ రేసు లో ఉన్నామంటూ సంకేతాలు పంపుతున్నారు.
వరుస ఓటములతో సొంతగూటిలోనే విమర్శలు ఒకవైపు.. ప్రజాదరణ లేదనే బాధ మరోవైపు.. చివరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానానికి రాజీనామా లేఖ ఇచ్చారు. కానీ, అధిష్ఠానం దా న్ని ఆమోదించలేదు. నైరాశ్యంలో ఉన్న ఆయన పీసీసీ పదవిపై ఆశలు వదులుకున్నారు. కానీ, సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా గళం వినిపించడం, తనకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తుండటంతో ఆయనలో తిరిగి ఆశలు చిగురించాయనే ప్రచారం జరుగుతున్నది. పీసీసీగా కొనసాగేందుకు సిద్ధమేనంటూ ఇటీవల ఆయన హస్తినకు సంకేతాలు పంపించినట్టు తెలుస్తున్నది. అందుకే పార్టీ కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.