* వరుసగా ఐదో రోజూ పెట్రో ధరల పెంపు!ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు నిదానంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. గురువారం నాడు లీటరుపై 60 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ఐదు రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ. 2.74 మేరకు పెరిగినట్లయింది.ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు రూ. 74. డీజిల్ రూ. 72.22కు చేరగా, ముంబైలో పెట్రోల్ రూ. 80.98. డీజిల్ రూ. 70.92కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ. 70.64కు పెరుగగా, బెంగళూరులో పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66కి, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 76.82. డీజిల్ రూ. 70.59కు, అమరావతిలో పెట్రోల్ రూ. 77.36. డీజిల్ రూ. 71.18కు చేరుకున్నాయి.
* కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా రకరకాల కొరతలను సృష్టిస్తోంది. ఇక విచిత్రమైన ఆహారపు అలవాట్లకు నిలయమైన చైనాలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చైనాలో పంది మాంసానికి విపరీతమైన డిమాండు ఉంటుందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అనే సంగతి తెలిసిందే. అయితే కొవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో ఆ దేశంలో పంది మాంసానికి కొరత ఏర్పడింది. దీనితో దేశీయంగా వరాహాల సంఖ్యను పెంచే ప్రయత్నాలను ఆ దేశం తీవ్రతరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఆ దేశం ఫ్రాన్స్ నుంచి వరాహాలను దిగుమతి చేసుకుంటోంది.
* అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి జారుకొంది.. కానీ, ఊరటనిచ్చే విషయం ఏమిటంటే నిరుద్యోగుల సంఖ్య తగ్గింది..! ఇదీ ఇటీవల అమెరికాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థ వెల్లడించిన గణాంకాల సారాంశం. ఈ సంస్థ లెక్కల ప్రకారం నిరుద్యోగుల శాతం 14.7 నుంచి 13.3శాతానికి దిగివచ్చింది. ఈ గణాంకాలపై అమెరికాలోనే పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులుగా చూపిస్తున్న వారిలో చాలా మందికి ఎటువంటి పనిలేదని.. కేవలం కరోనా సమయంలో తాత్కాలికంగా పెయిడ్ లీవ్ పొందుతున్న వారిని కూడా దీనిలో చూపించారని ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రచురించింది. ఏప్రిల్‌లో దేశంలోని నిరుద్యోగుల శాతం 19.7 ఉండగా.. అది మే నెలకు 16.3 శాతానికి దిగొచ్చింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగులను దీనిలో చూపించకపోతే మేలో కూడా నిరుద్యోగుల శాతం ఈ స్థాయిలో తగ్గదు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ పూర్తిగా తెరిచాక కూడా ఉద్యోగులకు పని దొరికే అంశంపై భిన్నవాదనలు ఉన్నాయి. టీకా కానీ, వైద్యం కానీ లభించకపోతే ఉద్యోగాల పెరుగుదల వేగంగా ఉండకపోవచ్చు.
* చెక్ బౌన్స్, రుణ వాయిదాల చెల్లింపుల్లో విఫలం కావడం వంటి వాటిని నేరాలుగా పరిగణించొద్దని ఆర్థిక శాఖ ఒక ప్రతిపాదన చేసింది. వీటితో పాటు 19 చట్టాల్లోని చిన్నపాటి నేరాలకు శిక్షలు తొలగించాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో వ్యాపారాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. ఈ 19 చట్టాల్లో నెగోషిబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం (చెక్ బౌన్స్), సర్ఫేసీ చట్టం (బ్యాంక్ రుణాల చెల్లింపు), ఎల్‌ఐసీ చట్టం, పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం, ఆర్‌బీఐ చట్టం, ఎన్‌హెచ్‌బీ చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, చిట్‌ఫండ్స్ చట్టం వంటివి ఉన్నాయి. వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసేందుకు వీలుగా చిన్నపాటి నేరాలకు శిక్షలు విధించరాదని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రతిపాదనలో పేర్కొంది. 19 చట్టాలపై జూన్ 23లోగా దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా ప్రతినిధులను కోరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సాధించడానికి ఇది చర్య దోహదపడుతుందని అభిప్రాయపడింది. వచ్చే స్పందనలకు అనుగుణంగా ఆర్థిక సేవల విభాగం తుది నిర్ణయం తీసుకోనుంది. జాబితాలో ఉన్న ఇతర చట్టాల్లో బీమా చట్టం, పేమెంట్స్, సెటిల్‌మెంట్స్ సిస్టమ్స్ చట్టం, నాబార్డ్ చట్టం కూడా ఉన్నాయి.