DailyDose

ఇది ముమ్మాటికీ కక్షసాధింపే-తాజావార్తలు

ఇది ముమ్మాటికీ కక్షసాధింపే-తాజావార్తలు

* కక్షసాధింపులో భాగంగానే టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు. అచ్చెన్న అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు, లోకేశ్‌లు ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని చంద్రబాబుకు అచ్చెన్న కుటుంబసభ్యులు తెలిపారు. తమతో మాట్లాడే అవకాశం లేకుండా తీసుకెళ్లారని వివరించారు. అచ్చెన్న కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారులపై ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెస్తోందో బయటపడిందని ఆయన విమర్శించారు. అచ్చెన్న అరెస్టుతో మరోసారి జగన్‌ కుట్ర బయటపడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు.

* ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 11,775 మంది నమూనాలు పరీక్షించగా 207 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 66 ఉండగా.. రాష్ట్రంలో 141 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,636 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు.

* దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేపడుతున్నారు. అయితే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయనే దానిపై ప్రజలకు సరైన అవగాహన లేదు. దీనికోసం తాజాగా గూగుల్‌ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ సెర్చ్‌, అసిస్టెంట్‌, మ్యాప్‌లు ఇక ఐసీఎంఆర్‌ ఆమోదించిన కొవిడ్‌-19 కేంద్రాల వివరాలను యూజర్లకు తెలపడంలో సహాయపడుతాయని తాజాగా గూగుల్‌ ప్రకటించింది.

* లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రైవేట్‌ కంపెనీలపై జులై చివరి వారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో వేతనాల చెల్లింపు అంశంపై జస్టిస్‌ ఆశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య పరస్పర అవసరాలు ఉంటాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

* కరోనా నేపథ్యంలో దేశ రాజధాని నగరం సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ జరిపింది. దిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారనీ.. ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

* లాక్‌డౌన్‌ కారణంగా విధించిన మారటోరియం అంశంపై సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఆర్‌బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై మూడు రోజుల్లోగా ఇరు పక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకోవాని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రుణాలపై ఆరు నెలల పాటు ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మారటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

* కరోనావైరస్‌ మార్చిలో మెల్లగా భారత్‌లో విజృంభించడం మొదలైంది.. దీంతో లాక్‌డౌన్‌ భయాలతో స్టాక్‌ మార్కెట్లు గంగవెర్రులెత్తిపోతున్నాయి. పాతాళాన్ని వెతుకుతున్నాయా..? అన్నట్లు పతనమయ్యాయి. మార్చి మధ్యలో రిలయన్స్‌ షేరు ధర రూ.900 దిగువకు పడిపోయింది. అయినా రిలయన్స్‌ బృందం గుంబనంగా ఉంది.. ఆ తర్వాత మెల్లగా షేరు ధర పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ రెండో వారం గడిచాక ఫేస్‌బుక్‌ డీల్‌ తెరపైకి వచ్చింది.. ఈ డీల్‌ విలువ సుమారు రూ.43 వేల కోట్ల పైమాటే.

* క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ తెందూల్కర్‌ గొప్ప ఆటగాడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంత గొప్ప క్రికెటర్‌ 15 ఏళ్లకే తనని ఆకట్టుకున్నాడని చెప్పారు టీమ్‌ఇండియా మాజీ సారథి దిలీప్‌ వెంగ్‌సర్కార్‌. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పోర్ట్స్‌ క్రీడాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సచిన్‌ను మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

* నటుడు రానా, మిల్కీబ్యూటీ తమన్నాలకు కథానాయిక శ్రుతిహాసన్‌ ఓ ఛాలెంజ్‌ విసిరారు. అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గులాబో సితాబో’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల అమితాబ్‌ ఆ చిత్రానికి సంబంధించిన ఓ ‘టంగ్‌‌ ట్విస్ట్‌’ను ఐదుసార్లు చెప్పి కోహ్లీ, దీపికా పదుకొణె తదితరులకు ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఛాలెంజ్‌కి నటి నేహా ధుపియా శ్రుతిహాసన్‌ను నామినేట్‌ చేశారు.