* జీఎస్టీ వసూళ్లపై ఆర్థికమంత్రి కీలక నిర్ణయం.ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీఎస్టీ వసూళ్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.2017 జులై నుంచి 2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారికి ఆలస్య రుసుము విధించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
* అణచివేసేలా ఆంక్షలు.. టెక్నాలజీ చౌర్యం.. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం.. కరోనా వైరస్ పుట్టుక.. పొరుగు దేశాలతో ఉద్రిక్తత.. ఇలా డ్రాగన్ కీర్తి క్రమంగా మసకబారుతుండటంతో అక్కడ పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు మెల్లిగా విదేశాలకు తరలివెళ్తున్నాయి. ముఖ్యంగా సులభతర వాణిజ్య విధానాలు, మౌలిక వసతులు, తక్కువ పన్నులు అమల్లో ఉన్న దేశాల వైపు ఇవి మొగ్గు చూపుతున్నాయి. మరోపక్క వివిధ రకాల వాణిజ్య ఒప్పందాల్లో వియత్నాం ఎటువంటి జంకు లేకుండా భాగస్వామి అవుతోంది. దీంతో ఆ దేశ వస్తువులకు డిమాండ్ పెరిగే కొద్దీ అక్కడకు పెట్టుబడులు రావడం మొదలైంది. తాజాగా వియత్నాం-ఐరోపా సంఘం మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోద ముద్ర పడింది. ఇరు పక్షాలు ఎదుటి వారిపై విధించే పన్నులు 99శాతం తగ్గిపోయాయి. ఇదే జరిగితే త్వరలో వియత్నాం ఉత్పత్తిలో మినీ చైనాగా మారడం ఖాయం.
* అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎఫెక్ట్‌తో నిన్న భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు ఇవాళ తిరిగి కోలుకున్నాయి. అది కూడా ఆరంభంలో భారీ నష్టాలను పూడ్చుకుంటూ లాభాలు నమోదు చేయడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్ల అండతో పుంజుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే దాదాపు 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ అనంతరం తిరిగి కోలుకుంది. చివరి రెండు గంటల్లో అనూహ్యంగా పుంజుకోవడంతో నిన్నటి నష్టాలను స్వల్పంగా భర్తీ చేసింది. మొత్తంగా 242.52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 33,780.89 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.90 పాయింట్లు లాభపడి 9,972.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.84గా ఉంది.
* భారత్‌కు అంతర్జాతీయ ఏజెన్సీలు ఇస్తున్న రుణ రేటింగ్‌లను ప్రభుత్వం తోసిపుచ్చింది. భారత మూలాలు బలంగా ఉన్నాయని, వాటికి మరింత మెరుగైన సౌర్వభౌమ రేటింగ్ ఇవ్వొచ్చని తెలిపింది. దేశం రుణాల చెల్లింపునకు సిద్ధంగా ఉందని, సామర్థ్యం కూడా ఉందని అభిప్రాయపడింది. భారత రేటింగ్‌ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించగా, ఎస్ అండ్ పీ 13వ ఏడాదీ అతితక్కువ పెట్టుబడి గ్రేడ్‌లోనే కొనసాగించింది. వీటిపై ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ స్పందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి క్షీణించనుందని, అయితే అక్టోబరు- మార్చి మధ్యలో రికవరీ వస్తే ఇది పరిమితంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏప్రిల్‌లో లాక్‌డౌన్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే.. వి-షేప్ రికవరీపై ఆశలతో 2020-21లో భారత జీడీపీ వృద్ధి 1.5- 2 శాతంగా నమోదుకావొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసిందని గుర్తుచేశారు. అయితే రికవరీ ద్వితీయార్థంలో వస్తుందా లేదా వచ్చే ఏడాది రానుందా అన్న దానిపై వాస్తవ వృద్ధి ఆధారపడి ఉందని సుబ్రమణియన్ అన్నారు.
* లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రైవేట్ కంపెనీలపై జులై చివరి వారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో వేతనాల చెల్లింపు అంశంపై జస్టిస్ ఆశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య పరస్పర అవసరాలు ఉంటాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కలిసి చర్చించుకొని ఓ పరిష్కారానికి రావాలని సూచించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య సయోధ్యకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అనంతరం ఆ నివేదికను కార్మికశాఖ కమిషనర్లకు సమర్పించాలని తెలిపింది.
* పెట్రోల్, డీజిల్ ధరలు ఆరో రోజూ పెరిగాయి. శుక్రవారం ప్రభుత్వ చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై 57 పైసలు, లీటరు డీజిల్‌పై 59 పైసలు పెంచాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.74.57కు చేరగా.. లీటరు డీజిల్ రూ.72.81కి పెరిగింది. ఆదివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు రోజుల్లో కలిపి లీటరు పెట్రోల్‌పై రూ. 3.31, డీజిల్‌పై రూ. 3.42ల చొప్పున ధర పెరగడం గమనార్హం. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.81.53, లీటరు డీజిల్ ధర రూ.71.48, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.78.47, లీటరు డీజిల్ ధర రూ.71.14, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.76.48, లీటరు డీజిల్ ధర రూ.68.70గా నమోదైంది.
* ప్రజా వాటాదార్లుగా ప్రమోటర్ల పిల్లలను పునఃవర్గీకరించరాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. ప్రమోటర్ల పిల్లలకు పెళ్లి అయినా, వేరేగా జీవిస్తున్నా, కంపెనీ మేనేజ్‌మెంట్‌తో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ పునఃవర్గీకరణకు సంబంధించి మిర్జా ఇంటర్నేషనల్ అడిగిన సందేహాలకు సెబీ సమాధానం ఇచ్చింది. మిర్జా ఇంటర్నేషనల్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ రషీద్ అహ్మద్ మిర్జా పెళ్లి అయిన కుమార్తెల విషయంలో స్పష్టత కోరారు. మిర్జాలో వారికి 10 శాతానికి పైగా ఓటింగ్ హక్కులు ఉన్నాయి. అయితే వేరే జీవితం జీవిస్తున్నారని, కంపెనీ వ్యవహారాల్లో జోక్యం లేకపోవడంతో ప్రమోటర్ గ్రూప్ నుంచి పబ్లిక్ విభాగానికి పునఃవర్గీకరించవచ్చా అని సెబీని కోరారు. ఐసీడీఆర్ కింద ప్రమోటర్ల కుమార్తెలు బంధువులేనని, వారిని పునఃవర్గీకరించడం కుదరదని సెబీ స్పష్టం చేసింది.
* దేశీయ ఔషధ కంపెనీలు యూఎస్‌లో ఒక న్యాయ వివాదంలో చిక్కుకున్నాయి. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, లుపిన్ తదితర 26 కంపెనీలు ఇందులో ఉన్నాయి. కృత్రిమంగా ధరలను పెంచటం, పరస్పరం కుమ్మక్కై పోటీని తగ్గించటం, జనరిక్ ఔషధాల వర్తకాన్ని అదుపు చేయటం… వంటి ఆరోపణలతో యూఎస్‌లోని మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ.ఫ్రోష్ ఈ కంపెనీలపై కనెక్టికట్ జిల్లా న్యాయస్థానంలో ‘లా సూట్’ దాఖలు చేశారు. అమెరికాలో బిలియన్ల కొద్దీ డాలర్ల అమ్మకాలను నమోదు చేసే 80 జనరిక్ ఔషధాల విక్రయాలకు సంబంధించి ఈ 26 కంపెనీలు నిర్వహించిన పాత్రను ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు. ఈ వివాదంలో 10 మంది వ్యక్తుల పాత్రా ఉన్నట్లు ఆరోపించారు. ఈ కంపెనీల నుంచి నష్టపరిహారం వసూలు చేయటంతో పాటు వాటికి భారీగా పెనాల్టీలు విధించాలని… మళ్లీ ఔషధ మార్కెట్లోకి పోటీ పరిస్థితులు ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని కంపెనీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ న్యాయ వివాదంలో బ్రియాన్ ఇ.ఫ్రోష్‌తో యూఎస్‌లోని ఇతర రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కూడా జత కలిశారు. ఈ కంపెనీల ప్రతినిధులు వివిధ సందర్భాల్లో పరస్పరం కలుసుకుంటూ… చట్టవ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకొని, మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకునే చర్యలపై కసరత్తు చేసి, వాటిని అమలు చేయటానికి సిద్ధమయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వల్ల యూఎస్‌లోని రోగులకే కాకుండా, మేరీల్యాండ్ రాష్ట్రానికి, ఆరోగ్య బీమా సంస్థలకు బిలియన్ కొద్దీ డాలర్ల నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. యూఎస్ చరిత్రలో అతిపెద్ద ‘కార్పొరేట్ కార్టెల్’ కేసు బహుశ ఇదే కావచ్చని అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ.ఫ్రోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.