Editorials

నేపాల్ నూతన మ్యాప్ విడుదల

నేపాల్ నూతన మ్యాప్ విడుదల

భారత్‌కు చెందిన కీలక సరిహద్దు భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురలను నేపాల్‌ తన అంతర్భాగాలుగా ప్రకటించుకుంది. భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నప్పటికీ దేశ మ్యాప్‌ను మారుస్తూ రూపొందించిన బిల్లును నేపాల్‌ పార్లమెంటు దిగువసభ శనివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. పొరుగుదేశం దుస్సాహసంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. నేపాల్‌ చర్యను ఏమాత్రం సహించేదిలేదని హెచ్చరించింది.

సరిహద్దు వివాదాలను చర్చలద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న నిబంధనకు వ్యతిరేకంగా నేపాల్‌ ప్రభుత్వం కయ్యానికి కాలుదువ్వుతున్నది. 1816లో కుదుర్చుకున్న సుగౌలీ ఒప్పందానికి విరుద్ధంగా భారతదేశ ఆధీనంలోని భూభాగాలను నేపాల్‌ భూభాగంగా చేరుస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది. ఈ వివాదాన్ని రాజేసిన అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలైన నేపాలీ కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాపార్టీ- నేపాల్‌, రాష్ట్రీయ జనతాపార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. శనివారం పార్లమెంటు దిగువసభలో ఈ బిల్లుపై చర్చకు హాజరైన 258మంది సభ్యులు అనుకూలంగా ఓటువేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3, నేపాల్‌ జాతీయ చిహ్నానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆమోదించిన ఈ బిల్లు త్వరలో నేపాల్‌ నేషనల్‌ అసెంబ్లీకి వెళ్తుంది. 72 గంటల వ్యవధిలో ఈ బిల్లుకు నేషనల్‌ అసెంబ్లీ ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడి ఆమోదంతో బిల్లు చట్టంగా మారుతుంది. భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లోని దర్చులా, లిపులేఖ్‌ ప్రాంతాలగుండా 80కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని ఇటీవల చేపట్టింది. బలగాలను చైనా సరిహద్దుకు వేగంగా చేరవేయటానికి ఈ రోడ్డుమార్గం భారత్‌కు ఎంతో కీలకం. దాంతో చైనా ప్రోద్బలంతోనే నేపాల్‌ ఈ ప్రాంతాలపై వివాదం చేస్తున్నదని అనుమానిస్తున్నారు.

వివాదాస్పద బిల్లును నేపాల్‌ పార్లమెంటు ఆమోదించటంపై భారత్‌ మండిపడింది. చారిత్రక ఆధారాలు లేకుండా కృత్రిమంగా సృష్టించిన సాక్ష్యాలను ఆమోదించబోమని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ చెప్పారు. ఈ వివాదంపై భారత అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా తెలిపామని శనివారం ఆయన పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోవాలన్న నియమాన్ని నేపాల్‌ ఉల్లంఘించిందన్నారు. ఇదిలా ఉండగా ఇండో-నేపాల్‌ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో నేపాల్‌ సరిహద్దు రక్షణ దళాలు అదుపులోకి తీసుకున్న బీహార్‌కు చెందిన లగాన్‌ యాదవ్‌ను శనివారం విడిచిపెట్టాయి.