అక్కడ దురద పెడుతోందా? అయితే, అది మధుమేహమే!
మర్మాంగాలు దురద పెడుతున్నాయా? అయితే, జాగ్రత్త అది తప్పకుండా మధుమేహం కావచ్చు.
మధుమేహం (డయబెటీస్).. ఈ వ్యాధికి ఇప్పుడు వయస్సుతో పనిలేదు. ఏ వయస్సులో ఉన్నా వచ్చేస్తుంది. బాల్యం నుంచి ఆహారపు అలవాట్లు క్రమం తప్పినా సరే.. యుక్తవయస్సుకు రాగానే ఎటాక్ చేస్తుంది. దురదృష్టం ఏమిటంటే.. ఈ వ్యాధి సోకిన వెంటనే గుర్తించడం కష్టం. మధుమేహం వల్ల కలిగే లక్షణాలు.. రోజువారీ జీవితంలో ఏర్పడే శరీరక సమస్యలు తరహాలోనే ఉంటాయి. తేడా ఏమిటంటే.. సాధారణ వ్యక్తుల్లో ఆ సమస్యలు చుట్టంలా వచ్చి పోతుంటాయి. కానీ, మధుమేహం ఉన్నవారికి ఆ సమస్యలు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. అంటే.. ఏదైనా సమస్య పదే పదే వస్తున్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించి మధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే.. చాపకింద నీరులా వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతింటాయి.
ఈ లక్షణాలు కనిపెట్టడం కష్టమే: మధుమేహాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఈ వ్యాధి పేరు ‘స్వీట్’గానే ఉంటుంది. కానీ, జీవితాన్ని చేదుగా మార్చేస్తుంది. గుండె వ్యాధులు కలిగించడమే కాదు.. నరాలను దెబ్బతీస్తుంది. చివరికి పాదాలకు సైతం సోకి.. నడవకుండా మూలన పడేస్తుంది. కాబట్టి.. మధుమేహాన్ని వీలైనంత వేగంగా కనిపెట్టి.. నివారణ చర్యలు చేపడితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా టైప్-2 డయబెటీస్ ఎప్పుడు ఎలా సోకుతుందో కూడా చెప్పలేం. మీ జీవనశైలి వల్ల గానీ, మీ పూర్వికుల వల్ల గానీ ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి.
పురుషాంగం దురద పెడుతున్నట్లయితే..: మధుమేహం వల్ల ఏర్పడే అరుదైన సమస్య ఇది. కొంతమందిలో మధుమేహం లక్షణాలు వెంటనే కనిపించవు. అయితే, పురుషాంగం దురద పెట్టడం, శిశ్నాగ్ర చర్మంపై దద్దర్లు వస్తాయి. వీటి వల్ల మూత్రం పోసినప్పుడు, సాధారణ సమయాల్లో కూడా అంగం చురుక్కుమంటూ మండుతుంది. ఈ సమస్యను మీరు తేలిగ్గా తీసుకోవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్య పరిభాషలో ఈ సమస్యను బలానిటీస్ (Balanitis) అని అంటారు.
బలానిటీస్‌కు డయబెటీస్‌కు సంబంధం ఏమిటీ?: మధుమేహం ఏర్పడినా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పినా.. ఈ సమస్య ఏర్పడుతుంది. మధుమేహం అదుపులో లేనట్లయితే అంగంలోని శిశ్నాగ్ర చర్మం మీద చిన్న చిన్న పొక్కులు వస్తాయి. వీటినే బెలానిటీస్ ఇన్ఫెక్షన్ అంటారు. అలాగే, మధుమేహం ట్రీట్మెంట్ కోసం వాడే ఔషదాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే.. కొన్ని ఔషదాలు శరీరంలో ఉండే చక్కెరలను మూత్రం ద్వారా బయటకు గెంటేస్తాయి. ఫలితంగా శీశ్రాగ్రంలో నిలిచిపోయే చక్కెర్లు ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. చక్కెర్లు పురుషాంగ చర్మంలో ‘ఈస్ట్’ అనే ఫంగస్‌ను ఏర్పరుస్తాయి. మధుమేహం రోగులు ఎక్కువగా మూత్రం పోస్తుండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
డయబెటీస్ లేనివారిలో కూడా..: బలానిటీస్ సమస్య మధుమేహం లేనివారిలో కూడా కనిపిస్తుంది. మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోని వ్యక్తులకు కూడా ఇది సోకుతుంది. అలాగే, సబ్బుల్లో ఉండే గాఢత కూడా పురుషాంగాలపై దుష్ప్రభావాలను చూపుతాయి. కాబట్టి.. పురుషాంగంలోని సున్నిత చర్మానికి సబ్బు తగలకుండా జాగ్రతపడండి. ఈ సమస్య రాకూడదంటే.. మూత్రానికి వెళ్లిన తర్వాత మర్మాంగాలను శుభ్రం చేసుకోవాలి. ఈ సమస్య కేవలం పురుషుల్లో మాత్రమే కాదు.. మహిళల్లో కూడా ఏర్పడుతుంది. మధుమేహం సోకిన స్త్రీలలో కూడా బలానిటిస్ తరహాలోనే ఫంగస్ ఏర్పడి ఇన్ఫెక్షన్లు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. మర్మాంగాల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలిగిన వైద్యులను సంప్రదించండి. సొంతం వైద్యం చేసుకోవద్దు.