Movies

క్షత్రియ పుత్రుడు వెనుక కథ ఇది

Kamal Hassan Shares The Story Behind Kshatriya Putrudu

అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘దేవర్‌ మగన్‌’. దీనినే తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ పేరుతో విడుదల చేశారు. 1992లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శివాజీ గణేషన్‌, రేవతి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కమల్‌ అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో కమల్‌హాసన్‌ సోషల్‌మీడియా లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు. ‘‘దేవర్‌ మగన్‌’ స్ర్కిప్ట్‌ రాస్తున్న సమయంలో నా స్నేహితుడు ఓ ఛాలెంజ్‌ విసిరాడు. ఆ స్ర్కిప్ట్‌ను వెంటనే పూర్తి చేయకపోతే తాను సినిమా నుంచి తప్పుకుంటానన్నాడు. దాంతో నేను ఒత్తిడికి గురయ్యాను. మా ఇద్దరిదీ చిన్నపిల్లలాట అని మాకు తెలుసు. కానీ అతి తక్కువ సమయంలో స్ర్కిప్ట్‌ రాసి చూపిస్తానని అతనితో చెప్పా. అలా ఏడు రోజులపాటు శ్రమిస్తే స్ర్కిప్ట్‌ పూర్తయ్యింది. అన్ని స్ర్కిప్ట్‌లను ఇలా రాయమంటే నాకు సాధ్యంకాని పని. కొన్ని పూర్తి చేయడానికి సంవత్సరం పట్టొచ్చు. కొన్ని నెల రోజుల్లోనే అయిపోవచ్చు. ఒకవేళ మీరు సూట్‌కేస్‌ నిండా డబ్బులిచ్చినా కొన్నిసార్లు నేను అంత త్వరగా పని పూర్తి చేయలేను.’ అని కమల్‌ అన్నారు.