కబీర్‌సింగ్’ (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్) చిత్రంతో బాలీవుడ్ చిత్రసీమలో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది పంజాబీ సుందరి కియారా అద్వాణీ. ప్రస్తుతం ఆమె హిందీలో లక్ష్మీబాంబ్, ఇందూ కి జవానీ, షేర్షా, బూల్ బులయ్యా-2 చిత్రాలతో బిజీగా ఉంది. కెరీర్ తొలినాళ్లలో అవకాశాలపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని….‘కబీర్‌సింగ్’ విజయం తన వ్యక్తిత్వాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందని పేర్కొంది. ‘ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు మనం ఏవిధంగా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. విజయాల్లోనే వినమ్రంగా ఉండటం అలవర్చుకోవాలి. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కాబట్టి విజయం ఎంత విలువైనదో నాకు బాగా తెలుసు. అనుక్షణం దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. సెట్స్‌లో ఎంత బిజీగా ఉన్నా అభిమానులు సెల్ఫీ అడిగితే ఎప్పుడూ కాదనను. షూటింగ్‌లో అలసిపోయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు అక్కడ చాలా మంది సెల్ఫీల కోసం పోటీపడుతుంటారు. అలాంటి సమయాల్లో కూడా ప్రశాంతంగా సెల్ఫీలు తీసుకోమని చెబుతా. ఎవరినైనా కాదంటే ఆ అపరాధభావన నన్ను వెంటాడుతుంది. నా వల్ల ఒక్క అభిమాని కూడా నిరుత్సాపడొద్దనుకుంటా. అభిమానులు నా కుటుంబం లాంటివారు. నాకొస్తున్న పేరుకు వారే కారణం’ అని కియారా అద్వాణీ చెప్పింది. ఒకప్పుడు సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని భయం కలిగేదని, ఇప్పుడు రిజల్ట్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడంపైనే దృష్టిపెడుతున్నాని పేర్కొంది. తన ఉన్నతిలో దర్శకనిర్మాత కరణ్‌జోహార్ కీలకభూమిక పోషించారని, ఆయన దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రంలో నటించాలన్నది తన చిరకాలకోరిక అని చెప్పింది.
రండి…నాతో సెల్ఫీ దిగండి
Related tags :