* సినీ నటి, ఒకప్పటి స్టార్ కథానాయిక రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఈసీఆర్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, అదే సమయంలో అక్కడకు వచ్చిన రమ్యకృష్ణ వాహనాన్ని( ట్ణ్07Q 0099) కూడా ఆపారు. అందులో తనిఖీ చేయగా, 96 బీర్ బాటిళ్లు,8 మద్యం సీసాలు గుర్తించారు. దీంతో డ్రైవర్ సెల్వకుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో రమ్యకృష్ణ కారులో లేరు. కేవలం రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆమెకు చెందిన కారుగా గుర్తించారు. ఈ ఘటనపై రమ్యకృష్ణ స్పందించలేదు. చెన్నైలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో మహాబలిపురం నుంచి కొనుగోలు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
* గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కావాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ చెప్పడంతో చంద్రబాబు ఆస్పత్రి బయటే ఉండిపోయారు. అనుమతి రాకపోవడంతో బయటనుంచే ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
* అక్రమ కేసులు పెడుతున్నారంటూ తెదేపా నేతలు ఆరోపిస్తున్నారని.. వాటిపై పూర్తి ఆధారాలతో చర్చకు సిద్ధమని మంత్రి పేర్ని నాని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై వస్తున్న ఆరోపణల నేసథ్యంలో మంత్రి స్పందించారు. అశోక్ లేలాండ్ నుంచి బీఎస్-3 లారీ ఛాసిస్‌లను తుక్కు కింద కొన్నారని చెప్పారు. 2018లో నకిలీ దస్త్రాలతో 98 లారీల ఛాసిస్‌లు నాగాలాండ్ కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వదిలి పెట్టేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
* మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అమెరికా, బ్రెజిల్, రష్యాలతో పోటీపడుతున్న భారత్.. 3,08,993 కేసులతో అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల్లో ఇంచుమించు సగం కేవలం ఐదు నగరాల నుంచే వస్తున్నాయని తెలిసింది. రాజధాని దిల్లీ (36,824), ముంబయి (55,451), పుణె (11,000 పైన), థానె (సుమారు 16,000)లతో సహా గుజరాత్‌లోని అహ్మదాబాద్ (సుమారు 16,000), చెన్నై (సుమారు 27,000), జైపూర్‌లో అత్యధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
* ఏపీలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 222 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరో 33 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికీ కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 5858కి చేరింది.
* అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. ఐదు దశాబ్దాల అనంతరం మరోసారి చంద్రయానాన్ని తలపెట్టింది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఓ మహిళ నాయకత్వం వహించనుండటం విశేషం. 1992లో నాసాలో చేరిన కేథీ ల్యూడర్స్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనుంది. తొలిసారిగా ఓ మహిళతో సహా ఇద్దరు వ్యోమగాములను 2024 కల్లా చంద్రునిపైకి పంపే కార్యక్రమానికి నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. భారీ వ్యోమనౌక ఎస్‌ఎల్‌ఎస్, ఓరియన్ క్యాప్సూల్‌ల ద్వారా సాకారం కానున్న ఈ చంద్రయాన ప్రయోగానికి… కేథీ నాయకత్వం వహించనున్నారు.
* పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్, మాజీ సారథి షాహిద్ అఫ్రిది కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. శనివారం ఓ ట్వీట్ చేస్తూ గురువారం నుంచి తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన శరీరంలో నొప్పులు మొదలయ్యాయని, కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ పాజిటివ్ వచ్చిందని తెలిపాడు.
* తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు తొలివిడత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాలు వ్వ్వ్.క్న్రుహ్స్.తెలంగన.గొవ్.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
* ఉత్తరప్రదేశ్‌లోని ఝూన్సీ నగరంలో ఓ ఓపెన్ జిమ్‌లోని ఒక పరికరం దానంతటే కదులుతూ కనిపించిన వీడియో గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భుజాల కసరత్తు కోసం ఉపయోగించే ఆ పరికరం ఎవరి ప్రమేయం లేకుండా కదలుతుండటంతో దెయ్యాలు కసరత్తులు చేస్తున్నాయని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇది దెయ్యాల పనికాదని, అధికంగా గ్రీజుని పోసి కొందరు ఆకతాయులు పరికరాన్ని కదిపి వీడియో చిత్రీకరించి అసత్య ప్రచారం చేశారని పోలీసు ఉన్నతాధికారి రాహుల్ శ్రీవాత్సవ్ తెలిపారు.
* ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్ హైదరాబాద్ కో ఫౌండర్ అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో సర్పంచి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. ఒక్కో రైతుకు సుమారు 4కిలోల విత్తనాలను పంపిణీ చేసి వారిలో ఆనందాన్ని నింపారు.
* ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరోసారి కలవరం మొదలైంది. దేశ రాజధాని బీజింగ్‌లో పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేశారు. 11 ప్రముఖ నివాస సముదాయాల్లో లాక్‌డౌన్ విధించారు. ఓ భారీ హోల్‌సేల్ మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 45 మందికి తాజాగా కొవిడ్ నిర్ధారణ కావడమే ఇందుకు కారణం.
* గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిబంధనలకు లోబడే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంతలా ప్రతిపక్షాల గొంతు నొక్కలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థ పెరుగుతుందనుకున్నామన్నారు. అయితే, రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. అరెస్టులను ఖండిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
* రాష్ట్రంలో కరోనా కట్టడి, పోతిరెడ్డిపాడుపై 203జీవోను అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు వేలల్లో చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం రోజుకు 500 పరీక్షలకే పరిమితమవుతోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా సరిగ్గా స్పందించడం లేదని మండిపడ్డారు. ఐసీఎంఆర్ నిబంధనలు అన్ని రాష్ట్రాలకు ఒక్కటేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
* పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 203ను రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని అరుణ అన్నారు. లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో పాలమూరు జిల్లా సహా ఇతర ఏ జిల్లాకు అన్యాయం జరిగినా భాజపా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ విషయంలో పార్టీ పోరాటం కొనసాగుతుందని అరుణ స్పష్టం చేశారు.