Sports

అఫ్రిదికి కరోనా పాజిటివ్

అఫ్రిదికి కరోనా పాజిటివ్

పాకిస్థాన్‌ ప్రముఖ క్రికెటర్‌, మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. శనివారం ఓ ట్వీట్‌ చేస్తూ గురువారం నుంచి తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన శరీరంలో నొప్పులు మొదలయ్యాయని, కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయమని విజ్ఞప్తి చేశాడు. కాగా, పాకిస్థాన్‌ క్రికెటర్లలో అఫ్రిది కరోనా బారిన పడిన రెండో వ్యక్తి. కొద్దిరోజుల ముందు మాజీ ఓపెనర్‌ తాఫిక్‌ ఉమర్‌ కూడా ఈ మహమ్మారి బారినపడ్డాడు. అతడు చికిత్స తీసుకొని ప్రస్తుతం కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాడు. మరోవైపు పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నాటి నుంచీ అఫ్రిది తన ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మందికి స్వచ్ఛందంగా సాయం అందించాడు. లాక్‌డౌన్‌ వేళ వేలాది మంది పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశాడు. అతడి దాతృత్వానికి టీమ్‌ఇండియా క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌సింగ్‌ కూడా మెచ్చుకున్నారు. కాగా, పాక్‌ మాజీ సారథి తన కెరీర్‌లో మొత్తం 398 వన్డేలు, 27 టెస్టులు, 99 టీ20లు ఆడగా 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే మార్చిలో జరిగిన పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలోనే వైరస్‌ విజృంభించడంతో ఆ టోర్నీ మధ్యలోనే నిలిచిపోయింది.