DailyDose

ఏడో రోజు పెరిగిన ఇంధన ధరలు-వాణిజ్యం

TNILIVE Business News || India Hikes Fuel prices On 7th Time

* పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై 59పైసలు, లీటరు డీజిల్‌పై 58 పైసలు పెంచాయి. దీంతో ఇప్పటివరకూ ఏడు రోజుల్లో పెట్రోలుపై 3.90 రూపాయలు, డీజిల్ పై 4 రూపాయలు పెరిగినట్లయింది.

* బ్యాంకుల సీఈఓలు, పూర్తి కాల డైరెక్టర్ల గరిష్ఠ వయో పరిమితిని 70 ఏళ్లుగా ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ప్రమోటరు గ్రూప్‌నకు చెందినవారైతే 10 ఏళ్ల గరిష్ఠ పదవీకాలానికే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపింది. బ్యాంకింగ్‌ రంగంలో పాలనను మెరుగుపరిచే ప్రణాళికల్లో భాగంగా ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనలు చేసింది.

* అమేజ్‌, సిటీ, జాజ్‌ వంటి పలు మోడళ్లలో లోపభూయిష్టంగా ఏర్పాటు చేసిన ఇంధన పంపుల్ని మార్చేందుకు 65,651 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) శుక్రవారం వెల్లడించింది. కంపెనీ స్వచ్ఛందంగా వీటిని మార్చడానికి ముందుకొచ్చినట్లు తెలిపింది. 2018 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన పలు వాహనాల్లో ఇంధన పంపులు సరిగ్గా అమర్చనందున, దీర్ఘకాలంలో ఇంజిన్‌ సామర్థ్యంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉండటంతో వాటిని మార్చేందుకు వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా 32,498 అమేజ్‌, 16,434 సిటీ, 7,500 జాజ్‌, 7,057 డబ్ల్యూ-వీ, 1,622 బీఆర్‌-వీ, 360 బ్రియో, 180 సీఆర్‌-వీ వాహనాల్ని వెనక్కి రప్పిస్తున్నట్లు పేర్కొంది. జూన్‌ 20 నుంచి దశల వారీగా దేశంలోని కంపెనీ విక్రయ కేంద్రాల వద్ద ఉచితంగానే ఇంధన పంపుల్ని మారుస్తామని, యజమానుల్ని వ్యక్తిగతంగా సంప్రదిస్తామని హెచ్‌సీఐఎల్‌ వెల్లడించింది.

* మోటార్‌ కార్లు, బస్సులు, లారీలు, మోటార్‌ సైకిళ్లలో వినియోగించే గాలి ఒత్తిడితో పని చేసే కొన్ని రకాల న్యూమాటిక్‌ టైర్ల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో చర్యలకు దిగింది. కొత్త న్యూమాటిక్‌ టైర్ల దిగుమతి విధానాన్ని ‘ఉచితం నుంచి పరిమితానికి’ సవరించినట్లు శుక్రవారం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. న్యూమాటిక్‌ టైర్లను ‘పరిమిత’ వర్గంలో చేర్చడం ద్వారా దిగుమతిదారు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు తీసుకొని వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు ఈ రకం టైర్ల దిగుమతిపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అనుమతులు అవసరం లేకున్నా సరిపోయేది. చైనా వంటి దేశాల నుంచి ఈ రకం టైర్లను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటంతో వాటిపై పరిమితులు విధించాలని పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో, దేశీయ తయారీని ప్రోత్సహించేలా ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టేషన్‌ వ్యాగన్లు, రేసింగ్‌ కార్లు, స్కూటర్లు, మల్టీ-సెల్యులార్‌ పాలీయురెథేన్‌ ట్యూబ్‌లెస్‌ టైర్లు, సైకిళ్లలో వాడే న్యూమాటిక్‌ టైర్ల దిగుమతిపై తాజా ఆంక్షలు వర్తిస్తాయి. అత్యవసరేతర వస్తువుల దిగుమతి బిల్లు తగ్గించుకోవడం, దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ దిగుమతుల బిల్లు 10 శాతం వరకు తగ్గి 46,700 కోట్ల డాలర్లకు పరిమితమైంది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మద్దతుతో సూచీలు భారీ నష్టాల నుంచి లాభాల్లోకి పరుగు తీశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమవడంతో, మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ప్రారంభ ట్రేడింగ్‌లో వీరు భారీ విక్రయాలకు పాల్పడటంతో కుప్పకూలిన సూచీలు అనూహ్యంగా చివర్లో లాభాలను ఆర్జించాయి. ఒక దశలో సుమారు 1,190 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 1,500 పాయింట్ల మేర ఊగిసలాడింది. చివరకు సెన్సెక్స్‌ 243 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల మేర లాభపడ్డాయి. వారం మొత్తం మీద చూస్తే, సెన్సెక్స్‌ 506.35 పాయింట్లు (1.47 శాతం), నిఫ్టీ 169.25 పాయింట్లు (1.66 శాతం) మేర నష్టపోయాయి. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 5 పైసలు నష్టపోయి 75.84 వద్ద ముగిసింది.