Devotional

శ్రీవారిని రోజుకు 6వేల మంది దర్శిస్తున్నారు

శ్రీవారిని రోజుకు 6వేల మంది దర్శిస్తున్నారు

శ్రీవారి దర్శనానికి నిత్యం 6వేల మంది భక్తులను అనుమతిస్తున్నామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు..

ఆన్‌లైన్‌లో ప్రతి రోజు 3 వేల టోకెన్లను జారీ చేస్తున్నామని చెప్పారు. ఒక్క రోజే జూన్ 30 వరకు భక్తులు టోకెన్లను కొనుగోలు చేశారని సింఘాల్ తెలిపారు.

ఇదే విషయమై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన… సర్వదర్శనానికి సంబంధించి ఆఫ్‌లైన్‌లో ప్రతి రోజూ 3వేల టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు.

21వ తేదీ వరకు భక్తులు టోకెన్లు తీసుకున్నారని తెలిపారు.

దర్శన టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద తనిఖీలు చేసి తిరుమలకు అనుమతిస్తామని సింఘాల్ స్పష్టం చేశారు.

కాగా, పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం దర్శన టోకెన్ల సంఖ్యను పెంచుతామన్నారు.

ఆన్‌లైన్‌లో టోకెన్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లోనే వసతి సౌకర్యాలను పొందవచ్చునని పేర్కొన్నారు..

10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 సంవత్సరాల పైబడిన భక్తులను కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు దర్శనానికి అనుమతించడం లేదన్నారు.

టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రతి రోజూ 10వేల మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారని సింఘాల్ వెల్లడించారు.

దర్శన టికెట్లను రద్దు చేసుకున్న భక్తులకు తిరిగి వారి డబ్బులు వారికి చెల్లించామని తెలిపారు.

21వ తేదీన సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు వేకువజామున నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీవారి ఆలయం మూసివేయబడుతుందన్నారు..

మధ్యాహ్నం 2.30 తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

కాగా, శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సమయంలో దాదాపు 22 లక్షల లడ్డు ప్రసాదాలను భక్తులకు విక్రయించినట్లు అనిల్ సింఘాల్ చెప్పారు..