కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఇంటి నుంచే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులకు బ్యాంకులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులతో ఇక వేగలేమని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. ఐఎన్‌ఎస్ సీ-వోటర్ నిర్వహించిన సర్వేలో 1,200 మందిలో అత్యధిక శాతం.. ప్రభుత్వరంగ బ్యాంకులపై నమ్మకాన్ని వ్యక్తం చేయగా, అదే ప్రైవేట్‌రంగ బ్యాంకుల పనితీరుపై పెదవి విరిచారు. 60 ఏండ్లకు పైబడిన వారైతే తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మారనున్నట్లు ప్రకటించారు. 12.7 శాతం మందిలో 12 శాతం మంది కో-ఆపరేటివ్ బ్యాంకుల వైపు మొగ్గుచూపగా, మిగతా 0.7 శాతం మంది ప్రభుత్వ రంగ బ్యాంకులే బెట్టరని అభిప్రాయపడ్డారు.
45 నుంచి 60 ఏండ్లలోపు వారిలో బ్యాంక్ ఖాతాలు కలిగిన 5.1 శాతం మందిలో 3.8 శాతం మంది తమ ఖాతాలను ప్రభుత్వరంగ బ్యాంకులోకి మారనున్నట్లు చెప్పగా.. 1.3 శాతం మంది కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరువాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక 25 నుంచి 45 ఏండ్లలోపు వారు ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ లేదా కో-ఆపరేటివ్ బ్యాంకులకు మారాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారితోపాటు పట్టణాల్లో ఉన్నవారు కూడా ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఇతర బ్యాంకులకు మారాలనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వరంగ బ్యాంకులు శాఖలు కలిగివుండటం ప్రభుత్వరంగ బ్యాంకులకు కలిసొచ్చింది.