Food

ఆలుబుఖరా పండ్లు తింటున్నారా?

ఆలుబుఖరా పండ్లు తింటున్నారా?

ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో తింటే మంచిదన్నది మనందరికీ తెలుసు. అయినప్పటికీ తియ్యగా ఉండవనో ఆ రుచి ఇష్టంలేకనో కొన్ని పండ్లను పక్కన పెట్టేస్తాం. అలాంటి వాటిల్లో ఒకటి ఆలూబుఖారా. ప్లమ్‌ పండ్ల జాతుల్లో ఒక రకమైన వీటిల్లో విటమిన్‌-సి, పొటాషియం, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని మలినాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇంకా విటమిన్‌-ఎ సమృద్ధిగా ఉండటంతో కళ్ల సమస్యలతో బాధపడేవాళ్లకీ ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వడగాలులూ అతినీలలోహిత కిరణాల వల్ల శరీరానికి కలిగే హానిని అడ్డుకునేందుకూ ఇవి సాయపడతాయి. అందుకే సాయంకాలం వేళ జ్యూస్‌ రూపంలో తీసుకుంటే ఎంతో మంచిదని చెబుతారు పోషకాహార నిపుణులు. వీటిల్లో ఉండే పొటాషియం కారణంగా బీపీ రోగులకి ఈ పండు చాలా మంచిది. ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్‌ రక్తహీనతనీ, పీచు మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. ముఖ్యంగా సార్బిటాల్‌, ఇసాటిన్‌ అనే పదార్థాలు పెద్ద పేగు నీటిని ఎక్కువగా గ్రహించేలా చేయడంతోబాటు జీర్ణ వ్యవస్థ పనితీరుకీ తోడ్పడతాయి. ఆలూబుఖారాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరుపుని సంతరించుకునేలా చేస్తాయి. నలభైలు దాటిన మహిళలు వీటిని రోజూ తినడం వల్ల ఇందులోని కె-విటమిన్‌ ఎముకలు బలహీనం కాకుండా చేస్తుంది. అందుకే సీజన్‌లోనే కాకుండా మిగిలిన సమయాల్లో డ్రైఫ్రూట్స్‌లో భాగంగా వీటిని తిన్నా మంచిదే.