WorldWonders

భద్రాచలం చీమల వేపుడు స్పెషల్

భద్రాచలం చీమల వేపుడు స్పెషల్

ఆకలైతే మీరేం తింటారు? అన్నమో.. రొట్టెలో పండో.. ఫలమో. అంతే కదా? కానీ.. భద్రాద్రి గుత్తికోయలు మాత్రం చీమలు తింటారు. చీమల వేపుడు.. చీమల చారు.. చీమల మసాలా.. మెనూ ఏదైనా చీమలు ఉండాల్సిందే! చిత్రంగా ఉంది కదూ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ.. అర్లపల్లి.. లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతమంతా గుత్తికోయలకు షెల్టర్‌జోన్‌ లాంటిది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి బతుకుదెరువు కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. వెదురు.. జామాయిల్‌ చెట్లు నరకడమే వీరి పని. వేసవిలో మాత్రమే ఈ పని ఉంటుంది మిగతా టైమంతా ఖాళీనే. చేతిలో డబ్బుండదు.. ఆకలేమో ఆగదాయె. అడవిలో దొరికే కాయలు.. దుంపలతో పాటు చీమల్ని ఆహారంగా తింటారు. గుత్తికోయలు గుంపులుగా ఉన్న చెట్లను ఎంపికచేసుకొని వాటికి ఎన్ని చీమలు ఉన్నాయో పరిశీలిస్తారు. పుట్లకొద్ది చీమలు ఉన్నట్లయితే, ఆ చెట్టు కొమ్మలను నరుకుతారు. ఓ పక్క చీమలు కరుస్తుంటాయి. అయినా లెక్క చేయకుండా వాటిని గిన్నెల్లో నింపి ఇంటికి తీసుకెళ్తారు. సేకరించిన చీమలను ఆకుల్లో చుట్టి.. పొయ్యిలో కాలుస్తారు. తరువాత గిన్నెలో వేసి.. రొయ్యల కూర లెక్క వండుతారు. జొన్నంబలి కాసుకొని వేయించిన చీమలను నంజుకొని అంబలి తాగుతారు. చీమల్లో ప్రొటీన్స్‌ అధికంగా ఉంటా యంటున్నారు వీళ్లు. వీరిలో కొన్ని సమూహాలు కొండ వెదురు కొమ్ములను కూడా ఆహారంగా తీసుకుంటాయి.