Sports

రెండింతలు శ్రమపడాల్సింది

రెండింతలు శ్రమపడాల్సింది

2003 వన్డే ప్రపంచకప్‌లో గంగూలీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఫైనల్లో ఓటమిపాలైనా ఆ టోర్నీ అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. అందులో ఒకటి సచిన్‌ తెందూల్కర్‌ బ్యాటింగ్‌. లిటిల్‌మాస్టర్‌ అత్యధిక పరుగులు సాధించడమే కాకుండా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. దురదృష్టవశాత్తూ ఫైనల్లో తొలి ఓవర్‌లోనే ఔటవ్వగా.. తర్వాత భారత్‌ ఓటమిచెందింది. ఒకవేళ టీమ్‌ఇండియా ఆ మ్యాచ్‌లో గెలుచుంటే.. నాటి పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ కెరీర్‌కు ఘన వీడ్కోలు దక్కేది. జోహెనస్‌బర్గ్‌ వేదికగా ఆసీస్‌తో తలపడిన కీలక పోరులో భారత్‌ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీనాథ్‌ సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. తాజాగా అతడు ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలపై కీడాస్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు భారత్‌ గెలవాలని భావిస్తే ప్రతి ఆటగాడు రెండింతలు శ్రమపడాల్సి ఉండేదన్నాడు.

‘టీమ్‌ఇండియా 2003 ప్రపంచకప్‌లో గెలిచేది. కానీ.. మేం తలపడింది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో. అది అప్పటికే వరుస విజయాలతో దూసుకెళుతోంది. దీంతో ఏ జట్టూ దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. చివరికి మేం ఓడిపోయాం. నేనా మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యా. మేం గనుక ఆ మ్యాచ్‌ గెలుచుంటే నా కెరీర్‌లో అదొక కలికితురాయిగా మిగిలేది. అయితే, మనం అనుకునేవన్నీ జీవితంలో జరుగుతాయని ఆశించలేము. టీమ్‌ఇండియా ఆ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తే కొన్ని విషయాలను ప్రత్యేకంగా చేయాల్సి ఉండేది. అత్యుత్తమ జట్టును టీమ్‌ఇండియా ఆరోజు ఓడించాలనుకుంటే ప్రతి ఆటగాడూ రెండింతలు కష్టపడాల్సిన అవసరం ఉండేది. మ్యాచ్‌ అనంతరం ఎక్కడ పొరపాటు చేశామని విశ్లేషించుకున్నాం. తొలుత బ్యాటింగ్‌ చేస్తే బాగుండేదా అని కూడా అనుకున్నాం. కానీ, అవన్నీ మ్యాచ్‌ తర్వాత వచ్చే ఊహాగానాలే. నేను మాత్రం ఒకటే అనుకుంటా. ఆస్ట్రేలియా బాగా ఆడే జట్టు. అంతకుముందు కూడా అదే జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. మేమంతా మా శక్తిసామర్థ్యాలకు రెండింతలు కష్టపడాల్సిందని అనుకుంటా. అలా అయినా మేం గెలిచేవాళ్లమేమో’ అని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు. ఆ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. రీకీ పాంటింగ్‌(140) చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించింది. జహీర్‌, శ్రీనాథ్‌, నెహ్రా పూర్తిగా విఫలమయ్యారు. భజ్జీ మాత్రం రెండు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 234 పరుగులకు ఆలౌటైంది. సచిన్‌(4) తొలి ఓవర్‌లోనే విఫలమయ్యాడు. సెహ్వాగ్‌(82) ఒంటరి పోరాటం చేసినా మరోవైపు నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో భారత్‌ 125 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.