DailyDose

అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే-తాజావార్తలు

అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే-తాజావార్తలు

* కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా జరగనున్నాయి. ఉభయ సభల సమావేశాలను ఈసారి కేవలం 2 రోజులకే కుదించబోతున్నట్టు తెలుస్తోంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం. అంతేకాదు,రాష్ట్ర బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడుతారని తెలుస్తోంది. ఆదే రోజు బడ్జెట్‌కు సభా ఆమోదం పొంది.. మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

* రాష్ట్ర ప్రభుత్వానికి ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత విధించే అధికారం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. పింఛనులో కోత విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఎలాంటి ఇతర ఆధారం లేని విశ్రాంత ఉద్యోగులు పింఛను కోత వల్ల ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు పేర్కొంది. కోత ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించింది.

* విశాఖలో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనివ్వకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ వైకాపా గూండాలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసే హక్కు శాసనసభ్యుడికి లేదా? అని ప్రశ్నించారు.

* భారత్‌ – నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అసాధారణమైనవనీ.. ఈ బంధాన్ని ప్రపంచంలో ఏ శక్తీ విచ్ఛిన్నం చేయలేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వర్చువల్‌ ర్యాలీలో మాట్లాడుతూ.. భారత్‌ – నేపాల్‌ దేశాల మధ్య బంధం ‘రోటీ – బేటీ’ లాంటిదన్నారు. ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామన్నారు.

* ఆంధప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 304 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదుకావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6456కి చేరింది.

* చైనా, పాకిస్థాన్‌ల వద్ద భారత్‌ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్‌కు చెందిన ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (సిప్రి) అభిప్రాయపడింది. ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా దేశాలు అణ్వాయుధాలున్నాయి. వీటి వద్ద జనవరి 2020 నాటికి 13,400 అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది.

* తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మె్ల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు గణేశ్‌ గుప్తా కూడా ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో గత రెండు రోజులుగా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది.

* డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 18న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువరించనుంది. జులై 6న పోలింగ్‌ నిర్వహించనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26న నామినేషన్లను పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.

* తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి విజృంభణ ఎక్కువగా కొనసాగుతున్న నాలుగు ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ విధించాలని సీఎం పళని స్వామి నిర్ణయించారు. ఈ మేరకు చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాల్లో జూన్‌ 19 నుంచి 30 వరకు కఠిన లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ జిల్లాలన్నీ చెన్నై మెట్రోపాలిటన్‌ పోలీస్ పరిధిలోనివే.

* వైకాపాపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ ఉన్నత స్థాయి నాయకత్వంపైనా విమర్శలు చేశారు. వైకాపా నేతలు కాళ్లా వేళ్లా పడి బతిమాలితేనే తాను పార్టీలో చేరానని స్పష్టంచేశారు. సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వనుందుకే మీడియా ముందు స్పందిస్తున్నానని చెప్పారు.

* అడాగ్ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్ అంబానీ వ్యక్తిగత హామీగా ఉన్న కార్పొరేట్‌ రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్‌బీఐ తదుపరి చర్యలను ప్రారంభించింది. వీటికి హామీదారు అయిన అనిల్‌ అంబానీ నుంచి వాటిని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ రుణాల మొత్తం విలువ రూ.1200 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. వాటి చెల్లింపులకు సంబంధించి గతంలో బ్యాంకుకు అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు.

* కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష అందరి హక్కు అని… దానిని ప్రతి ఒక్కరికీ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌-19 కారణంగా నానాటికి దిగజారుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ తరపున కాంగ్రెస్‌ పార్టీ దిల్లీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్ పాల్గొన్నారు. ప్రతి కరోనా బాధితుడి కుటుంబానికి, కంటైన్‌మెంట్‌లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రూ.10,000 చొప్పున అందచేయాలని ఆయన సూచించారు. వైద్య విద్య నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను తాత్కాలిక వైద్యులుగా ఉపయోగించవచ్చని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సూచించింది. కొవిడ్‌-19 కష్టకాలంలో పాఠశాల, కళాశాల హాస్టల్‌ భవనాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడవచ్చని ఆ పార్టీ సలహా ఇచ్చింది.

* చంద్రబాబు హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతామని మంత్రి అనిల్‌ అన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే అరెస్టు అయ్యారని.. మిగిలిన వారి అక్రమాలపై విచారణకు ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… ‘‘అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి జాబితా చాలా ఉంది. వారెవరినీ వదలబోం. తెదేపా నేతల అరెస్టులపై జేసీ సహా నారా లోకేశ్‌ అతిగా విమర్శలు చేస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసి ఉంటే లోకేశ్‌ కూడా లోపలికి వెళ్తారు. చట్టం అందరికీ సమానం. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాల్సిందే. తప్పు చేయలేదని చెబుతున్న వారంతా విచారణకు సహకరించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’ అని మంత్రి అన్నారు.