చరిత్రాత్మక బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. ‘పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’, ‘సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’లను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఈ బిల్లులను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను శాసనసభ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను శాసనమండలిలో అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ విఫలయత్నాలు చేసింది. ఆ బిల్లులను పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి నివేదించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో మండలి నియమావళిని ఉల్లంఘించింది. నిబంధనల ప్రకారం శాసనమండలి చైర్మన్‌కు ముందస్తు నోటీసు ఇవ్వలేదు. నియమావళిలో నిర్దేశించిన ప్రక్రియను పాటించలేదు. కాబట్టి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించడం సాధ్యం కాదని ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆ రెండు బిల్లులను శాసనసభలో రెండోసారి ప్రవేశపెట్టి ఆమోదించింది.
మూజువాణి ఓటుతో ఆమోదం
► ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం –1994 సవరణ బిల్లుకు ఆమోదం. ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేసేలా చట్ట సవరణకు ఈ బిల్లు తెచ్చారు. ప్రలోభాలు, అక్రమాలకు స్థానం లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా తెచ్చిన మార్పులు కూడా బిల్లులో ఉన్నాయి.
► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం –2005 సవరణ బిల్లుకు ఆమోదం
► జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న చట్ట సవరణ నిర్ణయం మేరకు రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం.
► ఏపీ ఆబ్కారీ చట్టం–1968 సవరణ బిల్లుకు ఆమోదం.
► అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ మద్య నిషేధ చట్టం–1995 సవరణ బిల్లుకు ఆమోదం.
► పురపాలక కార్పొరేషన్ల చట్టం– 1955, ఏపీ పురపాలికల చట్టం–1965 సవరణ బిల్లుకు ఆమోదం.
► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రమాణాలు పాటించేలా కమిషన్ పర్యవేక్షిస్తుంది.
► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
► రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది.