* భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.
* ‘కుల రాజకీయాలు చేయొద్దని, మా చిన్న కులంలో చిచ్చుపెట్టొద్దని ఆ కోటరీ సభ్యులను కోరుతున్నా’ అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పశ్చిమగోదావరి వైకాపా నేతలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి రంగనాథరాజు పశ్చిమ గోదావరి వైకాపా నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
* కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేతచంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా పదో తరగతి పరీక్షలు పెట్టలేదని గుర్తుచేశారు. తల్లిదండ్రులు, పిల్లల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలు రద్దు చేయాలన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో దీనిపై చంద్రబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా దృష్టిపెట్టలేదు. సీఎం నుంచి ఎవరూ మాస్కులు పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రెండో బడ్జెట్ ఉంది. ఈ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు కరోనాను పూర్తిగా విస్మరించి ప్రవర్తించారు’’ అని మండిపడ్డారు.
* ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నామని, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని ఆర్థిక మంత్రి తెలిపారు. రూ.2,24,789.18 కోట్ల అంచనాలతో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి 23న సీసీఎల్ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే ఈ సాయం జమచేయనున్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15,911 మంది నమూనాలు పరీక్షించగా 264 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 71 ఉండగా.. రాష్ట్రంలో 193 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,720 కేసులు నమోదయ్యాయి.
* తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుదనం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్లుగానే మంగళవారం 100 వెంటిలేటర్లు భారత్‌కు అందాయి. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ద్వారా భారత్‌కు 200 వెంటిలేటర్లు అందజేయడానికి ముందుకు వచ్చింది. దానిలో భాగంగా మొదటగా 100 వెంటిలేటర్లను భారత్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు అందించినట్లు మనదేశంలో యూఎస్ దౌత్యవేత్త కెన్నత్ జస్టర్ వెల్లడించారు.
* ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ వ్యాఖ్యలతో ఐపీఎల్ సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని అతడు అనడమే దానికి కారణం. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం జులై నుంచి 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమితిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఆసీస్‌లో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారని భావించారంతా.
* రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో తెరాస ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైరస్ వ్యాప్తి అరికట్టాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కరోనా వైరస్ పరీక్షలపై కేంద్రం దృష్టి సారించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చర్యలు చేపట్టారని విమర్శించారు. మూడు నెలల్లో కేవలం 40వేల మందికి మాత్రమే పరీక్షలు చేశారని.. అలాంటిది ఇప్పుడు 50వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామనటం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.
* తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. పరీక్షా ఫలితాలపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మొదటి, రెండో సంవత్సర ఫలితాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. రేపు లేదా ఎల్లుండి ఇంటర్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
* కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్‌ను వణికించిన ఈ మహమ్మారి తాజాగా దేశ రాజధాని బీజింగ్‌పై పడగవిప్పింది. నగరంలో ఉన్న అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ షిన్‌ఫడి తాజాగా వైరస్‌కు కేంద్ర బిందువైంది. నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో బీజింగ్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు నగర అధికారులు హెచ్చరిస్తున్నారు.
* ఎట్టకేలకు మార్కెట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి, 33,605 వద్ద ముగియగా, 100 పాయింట్ల లాభంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 9914 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.21 వద్ద కొనసాగుతోంది.