Sports

T20 ప్రపంచకప్ ఉండదు

T20 ప్రపంచకప్ ఉండదు

మళ్లీ కరోనానే పైచేయి సాధించింది. మరో మెగా ఈవెంట్‌ తోక ముడిచింది. పొట్టి ప్రపంచకప్‌ కూడా నిర్వహణకు దూరమైంది. ఐసీసీ ఇంకా ప్రకటించనప్పటికీ నిర్వాహక దేశం ఆస్ట్రేలియా ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ అసాధ్యమని స్పష్టం చేసింది. రేపో మాపో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ రంగం కరోనాను ఎదుర్కోలేకపోతోంది. అలాగే క్రీడా రంగం కూడా మహమ్మారి ముందు నిలువలేకపోతోంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీ సహా ఎన్నో ఆటలు, ఫార్ములాలు రద్దయిపోయాయి. కొన్నేమో వాయిదా పడ్డాయి. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ పరిస్థితి కూడా అక్కడికే వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గత రెండు సమావేశాల్లో తేల్చని టోర్నీ భవితవ్యాన్ని ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా తేల్చింది. ఇపుడున్న పరిస్థితుల్లో మెగా టోర్నీ అసాధ్యమని స్పష్టం చేసింది.కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న వేళ 16 జట్లను తీసుకొచ్చి టోర్నీని నిర్వహించలేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్‌ ఎర్ల్‌ ఎడింగ్స్‌ ప్రకటించారు. ఇందులో పాల్గొనే దేశాలన్నీ కూడా కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. అంతర్జాతీయ దారులన్నీ మూసుకొనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఏ ఇక నాన్చుడు ధోరణి తగదని… టోర్నీ కుదరదని చెప్పేసింది. మంగళవారం ఎడింగ్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘కోవిడ్‌ ప్రపంచమంతా పాకింది. పోటీ పడే దేశాల్లోనూ కరోనా ఉధృతంగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లను ఆస్ట్రేలియాకు రప్పించి, ప్రపంచకప్‌ నిర్వహించే అవకాశాలైతే లేవు. ఇది అత్యంత క్లిష్టం. అసాధ్యం కూడా! అయితే మా ప్రకటన రద్దు లేదంటే వాయిదానో కాదు. మాకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఐసీసీ ముందుంచాం. దీనిపై చర్చించి నిర్ణయించాల్సింది ఐసీసీనే’ అని తెలిపారు. గత వారం సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ టోర్నీపై ఏ నిర్ణయం తీసుకోకుండానే మీటింగ్‌ను ముగించింది. ఇంకొంత కాలం వేచిచూసే ధోరణిలో ఐసీసీ ఉంది. కానీ రాను రాను కోవిడ్‌ కోరలు చాస్తుందే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్‌ ఆఖరు దాకా సరిహద్దుల్ని మూసేసింది. నిజానికి ఆసీస్‌లో వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య ఇంకా 10 వేలను కూడా చేరుకోలేదు. సుమారు 7000 మంది వైరస్‌ బారిన పడగా… 6000 మంది కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించి అనవసర ఇబ్బందుల్ని తలకెత్తుకోవడం ఎందుకని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావించింది. పొట్టి కప్‌ ఈ ఏడాది జరగకపోతే వచ్చే ఏడాది అనుమానమే. 2021లో బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా నిర్వహణ కష్టంగా మారొచ్చు. 2022లో భారత్‌లోనే మెగా ఈవెంట్‌ జరుగుతుంది. కాబట్టి ఆసీస్‌ ఈవెంట్‌కు చోటుండదు.