దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అన్లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని అన్నారు. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. దీనిపై ప్రధాని స్పష్టతనిచ్చారు. దేశంలో లాక్డౌన్ల దశ ముగిసి.. అన్లాక్ల దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్లాక్-1 నడుస్తోందన్నారు. అన్లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయమై చర్చించాలని ముఖ్యమంత్రులతో మోదీ అన్నారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నందున మరోమారు లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని మోదీ స్పష్టతనివ్వడం గమనార్హం.
లాక్డౌన్ సమయంలో ప్రజలు పాటించిన క్రమశిక్షణతోనే దేశంలో కరోనా ఎక్కువగా వ్యాపించకుండా అడ్డుకోగలిగామని ప్రధాని మోదీ అన్నారు. అలానే కరోనా సోకిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత లాక్డౌన్ జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ప్రధాని ఈ సమావేశంలో చర్చించారు.
‘‘మనం ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతానికి కృషి చేయాలి. అప్పుడే వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి వైద్యం అందించగలం. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అలానే మనం టెస్టుల సంఖ్య కూడా పెంచాలి. అప్పుడే వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తించి ఐసోలేషన్కి తరలించి వైద్యం అందించగలం. దేశ వ్యాప్తంగా సుమారు 900 కరోనా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కరోనా ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సదుపాయంతో వేల సంఖ్యలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి’’ అని ప్రధాని తెలిపారు.
‘‘కరోనాపై పోరులో భావోద్వేగంతో కూడిన అంశం కూడా ఉంది. వైరస్ సోకుతుందనే అనే భయాలను తొలగించేందుకు ప్రజలకు సహాయం చేయాలి. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉంది. కరోనా సోకిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడడం, భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం, రోజులో వేలాది మంది బయట సంచరించడం వంటి కారణాలతో కొన్ని నగరాల్లో కరోనా కట్టడి మరింత సంక్లిష్టంగా మారిందని ప్రధాని అన్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో రికవరీ రేటు 52.79 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 10,794 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. ఆరో రోజు వరుసగా 10,000 కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,903కి చేరింది. దిల్లీ, ముంబయి నగరాల్లోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.