ఒక వూరిలో వూరి బయట ఒక గుడిసె లో తల్లీ కొడుకు నివసిస్తూ వుండే వారు.కొడుకు పేరు రాము. వాళ్ళు చాలా బీదవాళ్ళు. తల్లి చాలా మంది ఇళ్ళల్లో పాచిపని చేసి కొడుకు ను పోషిస్తూ వుండేది.
పిల్లలందరూ పక్క వూరికి వెళ్లి ఒక గురువు గారి దగ్గర చదువుకునే వారు.వాడు నేనూ వెళ్లి చదువుకుంటానని గొడవ చేశాడు. తల్లి ఆ గురువు గారి దగ్గరికి వెళ్లి కొడుకును చేర్పిస్తానని బతిమాలి ఆయనను ఒప్పించింది. .గురువు గారి వూరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి. మిగతా పిల్లలందరూ వారి వారి ఎడ్ల బండ్ల లో వెళ్ళే వారు.రాముడు నడిచి వెళ్ళేవాడు. ఒకనాడు వాడు వాళ్ళమ్మ తో అమ్మా!ఒంటరిగా అడివి లో వెళ్ళేటప్పుడు నాకు
భయమేస్తుంది. అన్నాడు.వాడి అమ్మ నాన్నా! ‘గోపాలా గోపాలా అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు నీకు భయ మెయ్యదు. అని చెప్పింది. వాడు అలాగే గోపాలా గోపాలా అని అరుస్తూ వెళుతుంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడుచేతిలో పిల్లనగ్రోవి తో వచ్చి పిలిచావా?అని అడిగాడు.వాడు వాళ్ళ అమ్మభయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు .సరేలే నేను నిన్ను అడవి దాటిస్తాను అని రోజు వాడిని అడవి దాటించి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు.రాముడు చాలా శ్రద్ధగా చదువుకునే వాడు.
ఇలా వుండగా ఒక రోజు గురువు గారింట్లో ఆయన కూతురి పెళ్లి జరుగుతూంది. పిల్లలందరూ వెళుతున్నారు.అందరూ ఏదో ఒక కానుక తీసుకొని వెళుతున్నారు.రాముడు అమ్మా! నేనేమి తీసుకెళ్ళాలి? అని అడిగాడు. మనం పేదవాళ్ళం నాయనా!మనం వాళ్లకు ఏమి కానుక యివ్వగలము?అని చెప్పింది.
వాడు విచారంగా వెళ్ళిపోయాడు.రోజు లాగే గోపాలా గోపాలా అని పిలిచాడు. ఆ గొల్ల
పిల్లవాడు పిల్లన గ్రోవి ఊదుకుంటూ వచ్చాడు.రాముడి ముఖం విచారంగా వుండడం చూసి ఎందుకు అలా వున్నావని అడిగాడు వాడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెంబు నిండుగా పాలు తీసుకొని వచ్చి వాళ్లకు పాయసానికి యివి ఉపయోగ పడతాయి తీసికెళ్ళు అని చెప్పాడు. వాడు జాగ్రత్తగా ఆ పాల చెంబు తీసుకొని గురువు గారింటికి వెళ్ళాడు.గురువు గారి భార్య తో అమ్మా నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్పాడు.ఆవిడ నిర్లక్షంగా ఒక నౌకర్ కి ఆ పాలు తీసుకొని వెళ్లి ఆ పాల గంగాళం లో పొయ్యమని చెప్పింది.వాడు పోసే సరికి మళ్ళీ చెంబు నిండా పాలు
వున్నాయి అలాగ ఎన్ని సార్లు పోసినా మరీ చెంబు నిండా పాలు వుంటున్నాయి.గంగాళం నిండి పోయింది.వాడు గురువుగారి భార్యను పిలిచి చూపించాడు.
. ఈ విషయం పెళ్లి యింటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసి పోయింది అందరూ ఆశ్చర్య పోతున్నారు గురువు గారు రాముడిని పిలిచి ఈ పాలు ఎక్కడ తెచ్చావు? అని అడిగాడు.రాముడు మొత్తం కథ అంతా అమాయకంగా చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పడం తను .రోజూ తను గోపాలా అని పిలవగానే గొల్లవాడు వచ్చి తనను అడవి దాటించటం,పాలు యివ్వడం అన్నీ చెప్పాడు. వాళ్ళెవ్వరూ నమ్మలేదు.వాడిని ఆ అడవి
కి తీసుకెళ్ళి ఏదీ యిప్పుడు పిలువు వస్తాడేమో చూస్తాము.అని అన్నారు.వాడు గోపాలా గోపాలా అని ఎన్ని సార్లు పిలిచినా ఎవరూ రాలేదు.అన్నీ అపద్దాలు, యిలా అబద్దాలు చెప్తావా?అని గురువు గారు, మిగతా వాళ్ళందరూ వాడిని బాగా తిట్టారు.
.వాడికి దుఃఖ మొచ్చింది పెద్దగా ఏడువ సాగాడు.ఎందుకు గోపాలా నీవు రావడం లేదు
రోజూ పిలవగానే వచ్చేవాడివి కదా! అని వెక్కి వెక్కి ఏడువ సాగాడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది.
నీవు అమాయకంగా మీ అమ్మ మాటను నమ్మి నన్ను పిలిచావు,నన్ను నీ స్నేహితుడిగానే భావించావు.నీది నిస్వార్థపూరితమైన స్నేహం, కనుక నేను వచ్చి నీకు సహాయం చేశాను..నేను ఈ స్వార్థ పరులకు కనిపించను.అందుకే రాలేదు. అని విని పించింది. అందరూ ఆశ్చర్య పోయారు.అప్పటినుండి వూరివాళ్ళు,గురువుగారు,రాముడిని అతడి తల్లినీ గౌరవంగా చూడడం ప్రారంభించారు. గురువుగారు రాముడినీ, తల్లినీ తమ యింటి దగ్గరనే ఒక ఇల్లు యిచ్చి వాళ్ళు జీవించడానికి తగినంత సహాయం చేసి చదువుకూడా చెప్పేవారు.
“దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితే సహాయం చేస్తాడని ఈ కథ యొక్క నీతి”