Movies

కత్రినా కష్టాలు

కత్రినా కష్టాలు

బాలీవుడ్‌ నాయిక కత్రినాకైఫ్‌ ఓ సూపర్‌ హీరో కథలో నటించనున్న విషయం తెలిసిందే. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా యాక్షన్‌ ప్రధానంగా సాగనుంది. దీని కోసం అప్పుడే కఠోర సాధన మొదలు పెట్టింది కత్రినా. ఈ విషయం గురించి అలీ అబ్బాస్‌ మాట్లాడుతూ ‘‘కత్రినాతో నేను చేస్తున్న భారీస్థాయి యాక్షన్‌ చిత్రమిది. ఈ కథను తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ ఇందులోని పాత్రకు నాయికగా ఎవరు సరిపోతారో తెలియక ఇన్నాళ్లు ఎదురుచూశాను. ‘టైగర్‌ జిందా హై’లోని యాక్షన్‌ సన్నివేశాల్లో కత్రినా నటన నన్ను ఆశ్చర్యపరిచింది. ‘టైగర్‌..’ తర్వాత చాలామంది నా కథకు కత్రినా అయితే బాగుంటుంది, ఆమెను పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రంలో చూపించమని చెప్పారు. అప్పుడు కత్రినాను దృష్టిలో పెట్టుకొని కథను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాను. నా కథలోని పాత్రకు తగిన చక్కని శరీరాకృతి కత్రినా సొంతం. లాక్‌డౌన్‌ సమయాన్ని చక్కగా వినియోగించుకొంది కత్రినా. ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. అదే సమయంలో గాయాలు కాకుండా జాగ్రత్త పడుతోంది’’అని చెప్పారు. ఈ సినిమా కథ ఎక్కువ భాగం విదేశాల్లో సాగుతుంది. ‘‘ఈ తరహా కథలో లోకేషన్స్‌ కీలకం. విదేశాల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని ముందు నుంచీ అనుకున్నాం. విదేశీ నటులు అవసరం కూడా చాలా ఉంది. పరిస్థితులు అన్నీ చక్కబడి విదేశాలకు విమానాల రాకపోకలు మెరుగైనప్పుడు చిత్రీకరణ మొదలుపెడతాం’’అని చెప్పారు అలీ అబ్బాస్‌.