Agriculture

పత్తి నాటేటప్పుడు ఈ సూచనలు తప్పనిసరి

పత్తి నాటేటప్పుడు ఈ సూచనలు తప్పనిసరి

ప్రత్తి పంట వర్షాలను అనుసరించి జూన్ రెండో వారం నుంచి విత్తుకోవచ్చు. ప్రత్తి వేసుకునే రైతులు 7- 10 రోజుల వ్యవధిలో 75-100 మి. మీ వర్షం పడిన తరువాతే విత్తుకో గువాలి. తక్కువ కాల పరిమితి గల విత్తనముల ఎంచుకొవడం, ఒక ప్రాంతంలోని రైతులందరూ వీలయినంత వరకు ఒకేసారి విత్తుకోవడం ద్వారా గులాబీ రంగు పురుగు తాకిడిని కొంత వరకు అరికట్టవొచ్చు.
ప్రత్తి పంటను వర్షాధార నల్ల నేలలు, నీటి వసతి కలిగిన ఎర్ర నేలల్లో సాగు చేసుకోవచ్చు. సమస్యాత్మక నేలలు, నీటి వసతి లేని తేలికపాటి నేలలు, ముంపునకు గురయ్యే నేలల్లో ప్రత్తి సాగు చేయకూడదు.
ప్రత్తి లో బీటి – 3 విత్తనములకు అనుమతి లేదు కనుక రైతులు బీటి – 3 విత్తనముల ను కొనరాదు. అనుమతి ఉన్న బీటి- 2 విత్తనములను కూడా రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్న కియోస్కులు వద్ద గాని, గుర్తింపు పొందిన విత్తనముల దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయవలెను.

ఎరువుల యాజమాన్యం సిఫారసు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజనిని, పోటాష్ లను మూడు సమ భాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ళకు 7-10 సెం.మీ దూరంలో వేసుకోవాలి.

ఎకరాకు 0.75 – 1 కిలోగ్రాముల విత్తన మోతాదు చొప్పున 90-120 సెం.మీ వరుసల మధ్య దూరం,45-60 సెం.మీ మొక్కల మధ్య దూరం తో అచ్చుతోలి, పాదుకు ఒక మొక్క చొప్పున విత్తుకోవాలి. విత్తిన 10 రోజుల్లో ఖాళీలు వున్నచోట మరల విత్తాలి. విత్తిన 3 వారాలకు ఒత్తు మొక్కలను పీకి వేయాలి

నీటి యాజమాన్యం
ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు. కనుక నీరు ఎక్కువగా పెట్టరాదు. భూమిలో వున్న తేమను బట్టి 20-25 రోజులకోసారి నీరు పెట్టాలి. సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే మరియు పూత సమయంలో, కాయ తయారగు సమయంలో నీరు పెట్టాలి.

కలుపు నివారణ, అంతరకృషి : విత్తే ముందు ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పన పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీ. లేదా అలాక్లోర్ 50% 1.5 నుండి 2.5 లీటర్లు విత్తిన వెంట నే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి.
విత్తిన 25-30 రోజులప్పుడు అంతరకృషి చేయడానికి అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరాకు 4 00 మి.లీ. క్విజలోఫాప్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు కలుపు సమస్య ఎక్కువగా వున్న టైతే ఎకరాకు 250 మి.లీ పైరిథయోబ్యాక్ సోడియంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఖరీఫ్ లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతరకృషి కుదరనప్పడు ఎకరాకు లీటరు పారాక్వాట్ 24% మందును 2 కిలోల యూ రియా / అమ్మోనియం సల్ఫేట్తో 200లీ. నీటిలో కలిపి ప్రత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకోవాలి.

సస్యరక్షణ – ప్రత్యేక సూచనలు
• ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను విత్తటానికి ముందు నీళ్ళలో నానబెట్టరాదు.
• రసంపిల్చే పురుగుల నివారణకు తోలిదశలో ఎక్కువసార్లు పురుగు మందులు పిచికారీ చేయరాదు.
• తెల్లదోమ ఉధృతి ఎక్కవగా వుంటే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి వుంచేతే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అంటుకుంటాయి.
• తెల్లదోమ ఆశించినప్పుడు పైరిత్రాయిడ్ మందుల వాడకాన్ని వెంటనే నిలిపి వేయాలి.
• తెల్లదోమను అదుపులో వుంచటానికి లీటరు 2 మి.లీ ట్రైజోఫాస్ లేదా ప్రోఫెనోఫాస్ మరియు 5 మి.లీ వేపనూనే కలిపి ఆకుల అడుగుభాగాన పడేటట్లు పిచికారీ చెయ్యాలి.
• ఎర్రనల్లిని అదుపులో ఉంచడానికి లీటరు నీటికి 3 గ్రా. నీళ్ళలో కరిగే గంధకం లేక 5 మి.లీ డైకోఫాల్ కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొదట 60 రోజుల వరకు నియోనికోటినాయిడ్ తరగతికి చెందిన మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్, ఎసిటామిప్రిడ్ లేదా ధయోక్సామ్ మందులను పంట పై పిచికారీ చేయకూడదు.
• పురుగు మందులను మార్చి మార్చి వాడుకోవాలి.