* తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. రెండు సంవత్సరాలకు కలిసి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ తొలి సంవత్సర ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
* కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని సూచించింది.ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. కేసుల వివరాలు ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని సూచించింది.
* ఎమ్మెల్సీల పోరాటం తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్ ద్వారా శాసనసభాపక్ష సమావేశం గురువారం నిర్వహించారు. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ తీసుకొచ్చారని మండిపడ్డారు. రూల్ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగారన్నారు. ఇప్పుడు జరిగింది బడ్జెట్ సమావేశాలా? లేక రాజధాని తరలింపు సమావేశాలా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
* భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరోనా వల్ల పూరీ జగన్నాథ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే అవకాశమున్నందున రథయాత్ర సబబు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రథయాత్రకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు.
* దేశ సరిహద్దుల్లో చైనా దమనకాండ నేపథ్యంలో త్వరలోనే డ్రాగన్ సహా పలు దేశాల నుంచి చౌకైన, తక్కువ నాణ్యత కల్గిన వస్తువుల దిగుమతులపై నిషేధం విధించేందుకు అవసరమైన నిబంధనలు త్వరలోనే వెల్లడించనున్నట్టు కేంద్ర ఆహార శాఖమంత్రి రాంవిలాస్ పాసవాన్ తెలిపారు. చైనా ఉత్పత్తులతో వ్యాపారం చేసుకుంటున్న చిన్నవ్యాపారులపై ఈ ప్రభావం ఎలా ఉంటుందని ప్రశ్నించగా.. తొలి ప్రాధాన్యం దేశానికేననీ.. ఆ తర్వాతే సంస్థలు, వ్యక్తుల ప్రయోజనాలు ఉంటాయన్నారు.
* ఏజీఆర్ బకాయిల్లోని కొంత మొత్తాన్ని వెంటనే ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలని గురువారం సుప్రీంకోర్టు ‘వోడాఫోన్ ఐడియా’ను ఆదేశించింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఈ నిధులు ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
* కరోనా మహమ్మారిని నిరోధించేందుకు సిద్ధం చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. మాస్కోకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన రెండు రకాల టీకాలు(లిక్విడ్ అండ్ పౌడర్)ను రెండు గ్రూపులుగా విభజించి 38 మంది చొప్పున వాలంటీర్లపై ప్రయోగించనున్నట్లు పేర్కొంది.
* నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్ నియామకాన్ని సవాల్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం… హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
* బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లోహ షేర్ల అండతో దేశీయ మార్కెట్లు గురువారం భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్700 పాయింట్లు లాభపడి, 34,208 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10వేల మార్కును దాటి స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.14 కొనసాగుతోంది.
* ఉత్తర భారతదేశంలో ఇటీవలికాలంలో పలుమార్లు భూకంప ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.
* విశాఖ ఏజెన్సీలో కొనసాగుతోన్న 48 గంటల మన్యం బంద్. ఏజెన్సీలో రె౦డవ రోజు స్వచ్చందంగా ముాతపడ్డ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు.
* వీర జవాన్ పళణికి రామనాధపురంలో అంత్యక్రియలు. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తమిళనాడు రామనాధపురంకు చెందిన జవాన్ పళని వీరమరణం. 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పళిని…22 ఏళ్ళుగా దేశానికి సేవలు.
* ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రైతులకు సూచించారు. తుళ్లూరులో ఎంపీ గల్లా జయదేవ్ రైతులతో సమావేశమయ్యారు. మలిదశ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించారు.